జవాన్‌ మృతదేహంపై పార్టీ జెండా

21 Jun, 2019 16:41 IST|Sakshi

ఒడిశా ఆర్మీ జవాన్‌ మృతదేహంపై బీజేడీ జెండా

భువనేశ్వర్‌: ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో అమరుడైన ఓ జవాన్‌ మృతదేహంపై రాజకీయ పార్టీకి చెందిన జెండాను ఉంచడం వివాదాస్పదంగా మారింది. ఒడిశాకు చెందిన అజిత్‌ సాహో అనే ఆర్మీ జవాన్‌ ఈనెల 12న కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతిచెందాడు. అయితే అంత్యక్రియల నిమిత్తం అతని మృతదేహాన్ని ఒడిశాలోని ఆయన స్వగృహానికి తరలించారు. అనంతరం అధికార బీజూ జనతాదళ్‌ (బీజేడీ)కి చెందిన కొందరు నాయకులు వచ్చి మతదేహంపై వారి పార్టీ జెండాను కప్పి.. నివాళి అర్పించారు. ఇది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో వెంటనే దానిని తొలగించారు. ఈ ఘటపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది.

దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్‌ మృతదేహంపై పార్టీ జెండాను ఉంచి.. బీజేడీ తీవ్రంగా అవమానించిందని మండిపడింది. అమరుల త్యాగాలకు కించపరిచే విధంగా బీజేడీ ప్రవర్తించిందని విమర్శించింది. బీజేపీ వ్యాఖ్యలపై స్పందించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర.. ఈ ఘటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదన్నారు. ఆ జెండాను ఎవరు కప్పారో కూడా తమకు నిజంగా తెలీదన్నారు. ఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా జవాను సోదరుడు పరేశ్వరన్‌ మాట్లాడుతూ.. స్థానిక బీజేడీ నాయకులు వచ్చి పార్టీ జెండాను మృతదేహంపై కప్పి వెళ్లారని తెలిపారు. విషాదంలో ఉన్న తాము దీని గురించి పెద్దగా పట్టించుకోలేదన్నారు. పక్కవారు చెప్పడంతో వెంటనే జెండాను తొలగించామని, తమ సోదరుడు దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడని చెప్పుకొచ్చారు.


 

మరిన్ని వార్తలు