బీజేపీకి 69, కాంగ్రెస్‌కు 50

25 Mar, 2018 02:36 IST|Sakshi

రాజ్యసభలో ప్రధాన పార్టీల బలాబలాలు

న్యూఢిల్లీ: రాజ్యసభలో అధికార పార్టీ బీజేపీ బలం పెరిగింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా గెలుచుకుని తన సంఖ్యను 69కి పెంచుకుంది. కాంగ్రెస్‌ నాలుగు సీట్లు చేజార్చుకుని 50కి పడిపోయింది. శుక్రవారం 58 ద్వైవార్షిక రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించక ముందు బీజేపీకి 48, కాంగ్రెస్‌కు 54 సీట్లున్నాయి. వచ్చే వారం 17 మంది బీజేపీ సభ్యులు, 14 మంది కాంగ్రెస్‌ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో తాజాగా బీజేపీ నుంచి 28 మంది, కాంగ్రెస్‌ నుంచి 10 మంది ఎన్నికయ్యారు. అందులో రెండోసారి ఎన్నికైన వారూ కొందరున్నారు.

కొత్త సభ్యులు ప్రమాణం చేసిన తరువాత రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 69కి, కాంగ్రెస్‌ బలం 50కి చేరుకుంటుంది. ఎన్డీయేలో భాగం కాని అన్నా డీఎంకే, టీఆర్‌ఎస్, వైఎస్సార్సీపీ, బీజేడీ లాంటి పార్టీలు బీజేపీకి సభా కార్యకలాపాల్లో మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. లోక్‌సభలో ఆమోదం పొందిన పలు బిల్లులు..బీజేపీకి సరిపడా బలం లేకపోవడంతో రాజ్యసభలో పెండింగ్‌లో పడిపోతున్నాయి. 2014 నుంచి అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా గెలవడం వల్ల ఎగువ సభలో బీజేపీ సభ్యుల సంఖ్య పెరగ్గా, ఆయా రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్‌ బలం తగ్గుతూ వస్తోంది. 

మరిన్ని వార్తలు