టార్గెట్‌ @ 125

27 May, 2019 03:51 IST|Sakshi

మిషన్‌ రాజ్యసభ

పెద్దలసభలో బలం పెంచుకోవడమే బీజేపీ తదుపరి లక్ష్యం  

లోక్‌సభ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ తన తదుపరి గురి రాజ్యసభపై పెట్టింది. పెద్దల సభలో మెజార్టీ సాధించడమే ఇప్పుడు బీజేపీ, దాని మిత్రపక్షాల ముందున్న లక్ష్యం. గత కొద్ది కాలంలో ఎన్డీయే ప్రతిపాదించిన కీలక బిల్లులు పెద్దల సభలో ఆమోదం పొందకుండా ఆగిపోయాయి. ట్రిపుల్‌ తలాక్, మోటార్‌ వాహన చట్టం, పౌర చట్టాలకు సవరణ బిల్లులు ఎన్డీయేకి తగినంత బలం లేని కారణంగా పెద్దల సభలో ఆమోదం పొందలేకపోయాయి. ఇటీవల కాలంలో అదే ఎన్డీయేకి అడ్డంకిగా మారింది. దానిని అధిగమించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.  

ప్రస్తుతం 101 ఎంపీల బలం
గత ఏడాది పార్లమెంటు చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీని మించి రాజ్యసభలో బీజేపీ బలం పెంచుకుంది. 245 సీట్లు ఉన్న సభలో ఎన్డీయే ఎంపీల సంఖ్య 101కి చేరుకుంది.  ముగ్గురు నామినేటెడ్‌ సభ్యులు స్వప్న దాస్‌గుప్తా, మేరీకోమ్, నరేంద్ర యాదవ్‌ల మద్దతు కూడా బీజేపీకే ఉంది. మరో ముగ్గురు స్వతంత్ర ఎంపీల మద్దతుతో కలిపి ఎన్డీయే బలం 107కి చేరుకుంది. ఆరేళ్ల పదవీకాలం కలిగిన రాజ్యసభ సభ్యులందరి ఎన్నికలు ఒకేసారి జరగవు. విడతల వారీగా సభ్యులు పదవీ విరమణ చేసినప్పుడల్లా కొత్త సభ్యుల ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రాల ఎమ్మెల్యేలు వీరిని ఎన్నుకుంటారు. అందుకే రాజ్యసభలో బలం పెరగాలంటే ముందుగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పట్టు బిగించాలి.

దేశవ్యాప్తంగా ఎన్డీయేకి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉంటేనే రాజ్యసభకు ఎక్కువ మంది ఎంపీలను పంపగలదు. విపక్షాల ప్రమేయం లేకుండా  పెద్దల సభలో  బిల్లులు పాస్‌ కావాలంటే ఎన్డీయేకి 123 మంది ఎంపీలు కావాలి.  2020 నవంబర్‌ నాటికి ఎన్డీయే ప్రభుత్వానికి మరో 19 సీట్లు అదనంగా వచ్చి 125కి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల సహకారంతో  బీజేపీ మేజిక్‌ ఫిగర్‌ దాటుతుంది. పదిహేనేళ్ల తర్వాత కేంద్రంలో అధికార పార్టీ రాజ్యసభలో కూడా మెజార్టీ సాధించిన పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించనుంది. వాటిలో అత్యధిక సీట్లు యూపీ నుంచే వస్తాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకే మిత్రపక్షం కావడంతో మరో ఆరు సీట్లు వస్తాయి. అసోం నుంచి మూడు, రాజస్తాన్‌ నుంచి రెండు, ఒడిశా నుంచి ఒకటి సభ్యులతో ఎన్డీయే బలం వచ్చే ఏడాదికి పెరగనుంది.

రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు ముఖ్యం  
ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయాలు నమోదు చేయగలిగితే రాజ్యసభలో బలం కూడా పెరుగుతుంది. ఇప్పట్నుంచి నవంబర్‌ 20 మధ్య కాలంలో కొత్తగా పెద్దల సభకు 75 మంది సభ్యులు వెళతారు.  ఎన్డీయే తన మార్కు పరిపాలన చూపించాలన్నా, కొత్త సంస్కరణలకు తెరతీయాలన్నా రాజ్యసభలో మెజార్టీ కూడా అత్యంత అవసరం. 

మరిన్ని వార్తలు