బెంగాల్లో రథయాత్రకు పచ్చజెండా

21 Dec, 2018 04:39 IST|Sakshi

బీజేపీ ర్యాలీకి కలకత్తా హైకోర్టు షరతులతో అనుమతి

అధికారులకు అక్షింతలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ తలపెట్టిన ‘రథయాత్ర’కు కోల్‌కతా హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. మతపరమైన అల్లర్లు చెలరేగే అవకాశం ఉందనే పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గురువారం ఈ కేసులో వాదోపవాదనలు విన్న జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి.. బీజేపీ రథయాత్రకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ విచక్షణాధికారాలను విపరీతమైన ధోరణిలో చలాయించిన సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘సరైన కారణాలు చూపకుండానే అధికారులు యాత్రకు అనుమతిని నిరాకరిస్తున్నారు.

సహేతుకమైన షరతులు విధించడం ద్వారానైనా యాత్రను అనుమతించాలా వద్దా అనే ప్రయత్నం కూడా వారు చేయలేదు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. రథయాత్ర సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. ‘యాత్ర సాగే మార్గంలో వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలిగించరాదు. ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగినా బాధ్యత వహించాలి. రథయాత్రపై కనీసం 12 గంటలు ముందుగా సంబంధిత జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌లకు సమాచారం అందించాలి’ అని బీజేపీ నాయకత్వాన్ని ఆయన ఆదేశించారు. అయితే, ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.  

తీర్పును స్వాగతించిన జైట్లీ
తీర్పును కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ స్వాగతించారు. తమ పార్టీ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వకపోవడంపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. ‘పశ్చిమబెంగాల్‌లో ఒక రాజకీయ పార్టీ తనకున్న హక్కు ప్రకారం తన కార్యక్రమాన్ని నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుకుంటే మానవ హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఒకవేళ ఎన్డీఏ, బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తే అప్రకటిత ఎమర్జెన్సీ అనే వారు కదా! ఇప్పుడెందుకు మౌనం?’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన ప్రారంభం కావాల్సిన బీజేపీ రథయాత్ర ‘సేవ్‌ డెమోక్రసీ ర్యాలీ’ప్రభుత్వ అనుమతి నిరాకరణ కారణంగా ఆగిపోయింది. కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించి, యాత్ర ప్రారంభిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దిలీప్‌ ఘోష్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు