హిమాచల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ గరమ్‌ గరమ్‌ పోటీ

15 May, 2019 07:52 IST|Sakshi

హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు చివరి దశలో ఈ నెల 19న పోలింగ్‌ జరుగుతుంది.  2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకుంది. 1989 నుంచీ జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఒక్క 1991లోనే కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు చెరో రెండు సీట్లు కైవసం చేసుకున్నాయి. కిందటి పార్లమెంటు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా, ఇప్పుడు కాషాయ ప్రభుత్వ పాలన సాగుతోంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 53.8 శాతం ఓట్లతో నాలుగు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌ 41 శాతం ఓట్లు సాధించినా ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. రాజధాని సిమ్లాతోపాటు మండీ, కాంగ్ఢా, హమీర్‌పూర్‌ లోక్‌సభ స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. 2018 నవంబర్‌లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 68 సీట్లలో 44 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. 

సిమ్లా బరిలో బీజేపీ కొత్త అభ్యర్థి 
షెడ్యూల్డ్‌ కులాలకు రిజర్వ్‌చేసిన సిమ్లా స్థానంలో బీజేపీ సిట్టింగ్‌ సభ్యుడు వీరేందర్‌ కశ్యప్‌కు బదులు సురేష్‌ కశ్యప్‌కు టికెట్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ తరఫున ధనీరామ్‌ శాండిల్‌ బరిలోకి దిగారు. కిందటి ఎన్నికల్లో వీరేందర్‌(బీజేపీ) తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి మోహన్‌లాల్‌ బ్రాక్తాను 84 వేలలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. ప్రస్తుత అభ్యర్థులు సురేష్‌ కశ్యప్, ధనీరామ్‌ శాండిల్‌ కోలీ(ఎస్సీ) కులానికి చెందినవారే. ఇద్దరికీ సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంది. నియోజకవర్గ పరిధిలోని సిర్మోర్‌ ప్రాంతంలోని హాటీ సామాజికవర్గానికి ఆదివాసీ(ఎస్టీ) హోదా కల్పించడం ఈ ఎన్నికల్లో ముఖ్యాంశంగా మారింది. ఈ వర్గం ప్రజల్లో ఉన్న అసంతృప్తి కారణంగా సిట్టింగ్‌ సభ్యుడు వీరేందర్‌కు బీజేపీ టికెట్‌ ఇవ్వలేదు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన మెరుపు దాడులను ఎన్నికల్లో గెలుపునకు బీజేపీ వాడుకుంటోందని గతంలో సిమ్లాకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ అభ్యర్థి శాండిల్‌ ప్రచారం చేస్తున్నారు. పాక్‌పై వైమానిక దాడులపై కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోందంటూ బీజేపీ అభ్యర్థి విమర్శిస్తున్నారు.  

హమీర్‌పూర్‌లో నాలుగోసారి అనురాగ్‌ 
కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ జరుగుతున్న మరో నియోజకవర్గం హమీర్‌పూర్‌. ఎప్పుడూ ఠాకూర్లే గెలిచే ఈ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ ఇప్పటికి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. మాజీ సీఎం ప్రేమ్‌కుమార్‌ ధూమల్‌ కుమారుడైన అనురాగ్‌ ఇంతకు ముందు క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన బీజేపీ టికెట్‌పై నాలుగోసారి పోటీకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి రామ్‌లాల్‌ ఠాకూర్‌ పోటీచేస్తున్నారు. ఆయనకు గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్ర కబడ్డీ జట్టులో సభ్యునిగా ఆయన ఆరుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. 1998 నుంచీ బీజేపీ అభ్యర్థులే గెలుస్తున్న ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. అనురాగ్‌ తండ్రి ధూమల్‌ కూడా గతంలో ఇక్కడి నుంచి మూడుసార్లు గెలిచారు. 44 ఏళ్ల అనురాగ్‌ 2014లో తన సమీప అభ్యర్థి రాజేంద్ర రాణాను 98 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. నాలుగోసారి విజయానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అనురాగ్‌కు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామ్‌లాల్‌ గట్టి పోటీ ఇస్తున్నారు. 

కాంగ్ఢాలో మంత్రితో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పోటీ 
రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపీ సీనియర్‌ నేత శాంతాకుమార్‌ 2014లో నాలుగోసారి గెలిచిన కీలక నియోజవర్గం కాంగ్ఢా. కిందటిసారి ఆయన తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి చందర్‌కుమార్‌ను లక్షా 70 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. బీజేపీ ఈసారి 84 ఏళ్ల శాంతాకుమార్‌కు బదులు రాష్ట్ర మంత్రి కిషన్‌ కపూర్‌ను పోటీకి దింపింది. కాంగ్రెస్‌ తరఫున పార్టీ ఎమ్మెల్యే పవన్‌ కాజల్‌ పోటీలో ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన కాజల్‌ ఈ ప్రాంతంలో గణనీయ సంఖ్యలో ఉన్న గద్దీ కుటుంబంలో జన్మించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ స్థానానికి ఆనుకుని ఉన్న కాంగ్ఢాలో పంజాబీలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కపూర్‌ కూడా పంజాబీయే. బీజేపీ తరఫున బాలీవుడ్‌ నటుడు, గురుదాస్‌పూర్‌ బీజేపీ అభ్యర్థి సన్నీ దేవల్, కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, పంజాబ్‌ మంత్రి నవజోత్‌సింగ్‌ సిద్ధూ పాల్గొంటున్నారు. 
 

మరిన్ని వార్తలు