మేమంటే.. మేమే! 

2 Aug, 2019 02:18 IST|Sakshi

రాష్ట్రంలో రెండో స్థానం కోసం జాతీయ పార్టీల రగడ

బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీ ప్రకటనలతో రక్తి కడుతున్న రాజకీయం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌కు తామంటే తామే ప్రత్యామ్నాయమంటూ కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇరుపార్టీల నేతల పోటాపోటీ ప్రకటనలు, మాటల యుద్ధాలతో కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ రెండు పార్టీల ‘ప్రత్యామ్నాయ’ ప్రతిపాదనలు, అది ఖరారు చేసుకునేందుకు పడుతున్న ఆపసోపాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమని చెప్పుకునేందుకు రెండు పార్టీల నేతలు ఎక్కడా తగ్గకుం డానే తమ ప్రయత్నాలు కొనసాగిస్తుండడం గమనార్హం.     

ఇద్దరూ జత కడుతున్నారు 
అధికార టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకునే క్రమంలో రెండు జాతీయ పార్టీలు ఆసక్తికర అంశాలను లేవనెత్తుతున్నాయి. టీఆర్‌ఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ పని చేస్తోందని బీజేపీ, టీఆర్‌ఎస్‌–బీజేపీలది నకిలీ యుద్ధమని కాంగ్రెస్‌ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. టీఆర్‌ఎస్‌–బీజేపీల బంధంపై చాలా కాలం నుంచి కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తుండగా, తమ బలం పెరగకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు టీఆర్‌ఎస్‌తో జత కడుతున్నారని బీజేపీ కొంతకాలంగా విమర్శిస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌కు రాజకీయ ప్రత్యర్థులుగా నిరూపించుకునేందు కు ఈ పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.  

ఐసీయూ, టులెట్‌ బోర్డులు 
లోక్‌సభ ఎన్నికల్లో 4ఎంపీ స్థానాలను గెలవడంతోపాటు కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన జోష్‌లో ఉన్న బీజేపీ.. త్వరలోనే రాష్ట్రంలో పాగా వేస్తామని ధీమాగా చెబుతోంది. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని, ఆ పార్టీని నాలుగు దిక్కులకు పంపేందుకే తమ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు గెలిచారని బీజేపీ నేతలంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్‌కు టులెట్‌ బోర్డు పెట్టుకోవాల్సిందేనని, ఆ పార్టీ ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పని అయిపోయిందనే సంకేతాలిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యంగా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారని, త్వరలోనే పెద్ద ఎత్తున చేరికలుంటాయని, అందులో కాంగ్రెస్‌తో పాటు టీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఉంటారనే చాలా కాలంగా బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో బిజీగా ఉన్న బీజేపీ నేతలు తాము చాపకింద నీరులా విస్తరిస్తున్నామనే సంకేతాలను ప్రజల్లోకి పంపడంలో కొంత మేర సఫలీకృతమయ్యారనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. తాము టార్గెట్‌ చేస్తే గురి తప్పదని, ఎట్టి పరిస్థితుల్లో 2023 నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. 

తిప్పికొడుతున్న కాంగ్రెస్‌ 
బీజేపీ ప్రత్యామ్నాయ వ్యూహాలను తమ క్షేత్రస్థాయి బలంతో తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌ కూడా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. బీజేపీకి క్షేత్రంలో బలం లేదని, నాలుగు ఎంపీలు లాటరీలో గెలిచారని, అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కేవలం నాలుగంటే నాలుగు జడ్పీటీసీ స్థానాల్లోనే గెలిచిందనే విషయాన్ని గమనించాలని వారంటున్నారు. అదే ఎన్నికల్లో తాము 29% ఓట్లు సాధించామని, టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొన్నామని అంటున్నారు.

అంతకుముందు జరిగిన సర్పంచ్‌ ఎన్నికలు, అంతకన్నా ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితికి అద్దంపడుతున్నాయని ఎద్దేవా చేస్తున్నారు. కేంద్రంలో అధికారం ఉండి, 4ఎంపీ స్థానాల్లో గెలిచినంత మాత్రాన బీజేపీది వాపే కానీ.. బలుపు కాదని, తెలంగాణతో ఆ పార్టీ పప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉడకవని అంటున్నారు. ఎప్పటికైనా టీఆర్‌ఎస్‌ను తామే ఓడిస్తామని, ఆ శక్తి తమకు మాత్రమే ఉందని, ఈ విషయం రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో తేలిపోతుందని «కాంగ్రెస్‌ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. 

ఆ.. మాకెందుకులే! 
ఈ విమర్శలను టీఆర్‌ఎస్‌ నిశ్శబ్దంగా గమనిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాల కారణంగా అక్కడక్కడా బీజేపీపై చెణుకులు విసురుతున్న గులాబీ నేతలు ఆ రెండు పార్టీలే తేల్చుకోనీ అనే ధోరణిలోనే వెళ్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మీడియాతో ఇష్టాగోష్టి సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికలలో సింహభాగం తామే గెల్చుకుంటామని, రెండో స్థానంలో ఎవరుంటారనేది ఆ రెండు పార్టీలే తేల్చుకోవాలన్నారు. ఇదే ధోరణిలో రాష్ట్రస్థాయి నేతల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న టీఆర్‌ఎస్‌ కేడర్‌ వరకు.. కాంగ్రెస్, బీజేపీల వ్యవహారశైలిని చూసీచూడనట్టే వ్యవహరిస్తున్నారు.  

మరిన్ని వార్తలు