ప్రచారానికి హేమాహేమీలు

24 Oct, 2018 02:46 IST|Sakshi

     బీజేపీ, కాంగ్రెస్‌ ఏర్పాట్లు 

     బీజేపీ తరఫున 10 రాష్ట్రాల సీఎంలు

     6–8 సభల్లో మోదీ, అమిత్‌ షా

     3–4 బహిరంగ సభలకు హాజరుకానున్న సోనియా గాంధీ

     కర్ణాటక, మహరాష్ట్ర, కేరళ, గుజరాత్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా రంగంలోకి...

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు జాతీయ పార్టీలు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. మహాకూటమి సీట్ల పంపకం నవంబర్‌ తొలి వారానికల్లా ఖరారయ్యే అవకాశం ఉండటంతో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆయా పార్టీలు ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను ప్రచారపర్వంలోకి దింపబోతున్నాయి. 

నాలుగు రాష్ట్రాల నేతలు... 
రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులను కలిసిన నేతలతోపాటు గతంలో ఇన్‌చార్జులుగా ఉన్న నాయకులను రంగంలోకి దించాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భైంసా, కామారెడ్డి బహిరంగ సభల్లో పాల్గొని కార్యకర్తలు, నేతల్లో నూతనోత్తేజాన్ని నింపారు. అదే విధంగా యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ 3–4 బహిరంగ సభల్లో పాల్గొనేలా టీపీసీసీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికితోడు సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్‌ పటేల్, సిద్ధరామయ్య, మల్లికార్జున్‌ ఖర్గే, ఉమెన్‌ చాందీ, కేంద్ర మాజీ మంత్రులను పూర్తిస్థాయిలో తెలంగాణలో ప్రచారం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది.

అలాగే కర్ణాటకకు చెందిన కీలకమైన నలుగురు కాంగ్రెస్‌ మంత్రులను కొన్ని జిల్లాలకు ఇన్‌చార్జులుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో మంచి వాగ్ధాటిగల వారిని ఎంపిక చేసి ప్రచారపర్వంలో దించాలని, క్యాడర్‌ను గెలుపు ధీమావైపు నడిపించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర నేతలకు ఏఐసీసీ సూచించినట్లు సమాచారం. నవంబర్‌ ఒకటో తేదీకల్లా కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్‌కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక నేతలను తెలంగాణలో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ సంబంధిత రాష్ట్రాల ఇన్‌చార్జులను మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. నవంబర్‌ మొదటి వారం నుంచి డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు వారంతా ప్రచారంలోనే ఉండేలా ఏర్పాట్లు చేయాలని టీపీసీసీకి హైకమాండ్‌ సూచించినట్టు సమాచారం.

10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ పది రాష్ట్రాల సీఎంలను రంగంలోకి దింపనున్నట్లు తెలిసింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్రం లో 6–8 బహిరంగ సభల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే కేంద్ర మంత్రులను కొన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జులుగా నియమించే ఆలోచనలో ఆ పార్టీ జాతీయ నేతలున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జిగా రాష్ట్రంలోనే ఉంటున్నారు. వారితోపాటు స్మృతీ ఇరానీ, హర్షవర్ధన్, రాజ్‌నాథ్‌సింగ్, ప్రకాశ్‌ జవదేకర్‌ లాంటి మంత్రులను ప్రచారపర్వంలో ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇలా మొత్తంగా బీజేపీలోని 25–30 మంది కీలక నేతలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇలా ఒక్కో పార్లమెంట్‌ సెగ్మెంట్‌ బాధ్యతలను కేంద్ర మంత్రులకు అప్పగించేందుకు అమిత్‌ షా వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  

మరిన్ని వార్తలు