ఈశాన్యంలో ఎదురీత

2 Apr, 2019 10:42 IST|Sakshi

పౌరసత్వ బిల్లు బీజేపీ పుట్టి ముంచుతుందా?

పౌరసత్వ సవరణ బిల్లుపై బీజేపీ మొదట అవలంబించిన మొండివైఖరి కారణంగా 8 ఈశాన్య రాష్ట్రాల్లో ఈసారి ఎదురీదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రాంతంలోని 25 సీట్లలో 22 గెలవాలన్న లక్ష్యం నెరవేరడం కష్టమే. ప్రాంతం, జాతి ఆధారంగా ఉనికిని కాపాడుకునే ప్రాంతీయ పక్షాలను బీజేపీకి దూరం చేసింది పౌరసత్వ బిల్లు. ఈ మిత్రపక్షాలన్నీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక సీట్లున్న ఒక్క అస్సాం (14)లోనే అక్కడి ప్రాంతీయ పక్షం ఏజీపీతో పొత్తు కుదుర్చుకుంది. పౌరసత్వ బిల్లు చట్టమైతే తమ ఉనికికి భంగం కలుగుతుందని ఈశాన్యంలోని స్థానిక ప్రజానీకం భయపడుతోంది. బిల్లును వ్యతిరేస్తూ చాలా రాష్ట్రాల్లో ఆందోళనలు నడిచాయి. పూర్వపు మిత్రపక్షాలుగా ఉన్న ప్రాంతీయ పక్షాలన్నీ పొత్తుల్లేకుండానే పోటీకి దిగుతున్నాయి. ఈ నెల 13న ఈశాన్యానికి చెందిన ఏజీపీ, బీపీఎఫ్, సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్కేఎం) నేతలతో భేటీ అయిన బీజేపీ నేత రామ్‌మాధవ్‌ బీజేపీ పరిస్థితి ఇక్కడ అంతా సవ్యంగా లేదని అంగీకరించారు. ఈశాన్య ప్రాంతంలో బీజేపీ చొరవతో ఏర్పడిన ఈశాన్య ప్రజాతంత్ర కూటమి (నెడా) పార్టీలు విడిగా పోటీ చేస్తున్నాయని ఆయన చెప్పారు. ‘వారికి శుభాకాంక్షలు. ఎన్నికల తర్వాత ఈ పార్టీలు ప్రధాని నరేంద్రమోదీకి మద్దతు ఇస్తాయి’ అని ఆయన తెలిపారు.

త్రిపురలో ఎదురుతిరిగిన సంకీర్ణ భాగస్వామి
త్రిపుర బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఆదివాసీల పార్టీ ఐపీఎఫ్టీ రెండు లోక్‌సభ సీట్లలోనూ బీజేపీపై పోటీ చేయాలని నిర్ణయించింది. ఫలితంగా త్రిపురలో బీజేపీ బహుముఖ పోటీ ఎదుర్కొంటోంది. ఏడాది క్రితం వరకూ ఈశాన్యంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. నెడాలోని ఎనిమిది మిత్రపక్షాలతో ఇప్పుడు పొత్తులు కుదరలేదు. పార్టీకి సరైన అభ్యర్థులు కూడా దొరకడం లేదు. ప్రతిపక్షాలు బలోపేతమౌతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన బలం నిలబెట్టుకోవడమే కష్టంగా కనిపిస్తోంది. కిందటేడాది నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన పాత మిత్రపక్షం నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్పీఎఫ్‌)తో తెగదెంపులు చేసుకుని అప్పటి నాగా సీఎం నెయిఫ్యూ రియో స్థాపించిన ఎన్డీడీపీతో పొత్తు పెట్టుకుంది. 2018 డిసెంబర్‌ మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో మరో నెడా భాగస్వామి మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) కూడా బీజేపీతో స్నేహం వదులుకుని ఒంటరిగా పోటీచేసింది. బీజేపీ ఒక సీటు గెలుచుకోగా, మొత్తం 40 సీట్లకు గాను ఎంఎన్‌ఎఫ్‌ 26 సీట్లు సాధించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్యంలో ఆందోళనలు చెలరేగాయి. అస్సాంలో ఈ బిల్లు కారణంగా బీజేపీ ప్రభుత్వం నుంచి ఏజీపీ వైదొలగింది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందని కారణంగా ప్రస్తుతం ఈ బిల్లు మురిగిపోయింది. కాని, ఇక్కడి ప్రాంతీయ పక్షాలు బీజేపీకి దూరమయ్యాయి. ఏజీపీ మళ్లీ బీజేపీతో చేతులు కలిపినా దాని విశ్వసనీయత దెబ్బతింది.

ఈశాన్యాన కొత్త సూరీడు ‘కాన్రాడ్‌ సంగ్మా’
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాల వల్ల మేఘాలయ సీఎం కాన్రాడ్‌ సంగ్మా ఈశాన్య ప్రాంతంలో కొత్త నేతగా అవతరిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని సొంత పార్టీ ఎన్పీపీ అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి ఏప్రిల్‌ 11న జరిగే ఎన్నికల్లో 33 సీట్లకు పోటీ చేస్తోంది. ఈశాన్యంలోని 14 లోక్‌సభ సీట్లలో అభ్యర్థులను ఎన్పీపీ నిలబెడుతోంది. బీజేపీకి ఈ పార్టీ వ్యతిరేకం కాదుగాని ఏజీపీ మాదిరిగా ఎన్నికల ముందు పొత్తుకు సిద్ధంగా లేదు. బీజేపీ, ఎన్పీపీ మధ్య పొత్తు కుదిరితే పౌరసత్వ బిల్లుపై వ్యతిరేకత చల్లబడిపోయేది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల తర్వాత బీజేపీతో చేతులు కలుపుతామని ఎన్పీపీ నేత వివేక్‌రాజ్‌ వాంగ్‌ఖేమ్‌ చెప్పారు. సిక్కింలో ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ నాయకత్వంలోని సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్డీఎఫ్‌) నెడాలో భాగమే అయినా లోక్‌సభతో పాటు సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తోంది. సిక్కింలో ప్రధాన ప్రతిపక్షమైన ఎస్కేఎంతో చేతులు కలపాలని బీజేపీ భావించింది. కాని, తర్వాత ఎస్కేఎం ఒంటరి పోరుకే నిర్ణయించుకుంది. మరోపక్క అస్సాంలో తన ఏడుగురు సిట్టింగ్‌ సభ్యుల్లో ఐదుగురికి ఈసారి టికెట్‌ ఇవ్వరాదని బీజేపీ నిర్ణయించింది. వారిలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత, తేజ్‌పూర్‌ ఎంపీ ఆర్పీ శర్మ, కేంద్ర మంత్రి రాజేన్‌ గోహెయిన్‌ (నౌగాంగ్‌), సీనియర్‌ నేత బిజయా చక్రవర్తి (గువాహటి) ఉన్నారు. నెడా కన్వీనర్‌గా ఉన్న హిమంతా బిశ్వ శర్మకు కూడా బీజేపీ టికెట్‌ ఇవ్వలేదు. ఈశాన్యంలో బీజేపీ పోటీచేసే అన్ని సీట్లపై ఆయన దృష్టి పెట్టడానికి వీలుగా ఆయనకు టికెట్‌ ఇవ్వలేదని తెలిపింది.

మొత్తం సీట్లు  25
బీజేపీ           08
కాంగ్రెస్‌         08
ఏఐయూడీఎఫ్‌03
సీపీఎం        02
ఎన్పీపీ        01
ఇండిపెండెంట్‌01
ఎస్డీఎఫ్‌      01
ఎన్పీఎఫ్‌    01

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు