16 ఎంపీ సీట్లివ్వండి.. ఢిల్లీని శాసిద్దాం

8 Jan, 2019 04:47 IST|Sakshi
శివసాయితో కేటీఆర్‌; సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కేటీఆర్‌ పిలుపు

కాంగ్రెస్, బీజేపీలకు మేజిక్‌ ఫిగర్‌ రాకపోవచ్చు

మనకు చక్రం తిప్పే అవకాశం వస్తుంది

త్వరలో నల్లగొండలో ఫ్లోరోసిస్‌ భూతం కనుమరుగు

సాక్షి, హైదరాబాద్‌: ‘పార్లమెంటు ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు 16 సీట్లివ్వండి. మనం ఢిల్లీని శాసిద్దాం’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు మేజిక్‌ ఫిగర్‌ వచ్చే అవకాశాల్లేవు. మనకు 16 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం లభిస్తుంది. ఇందుకోసం కార్యకర్తలు తీవ్రంగా కృషి చేయాలి. మొన్నటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సాధించింది మామూలు విజయం కాదు.

ప్రధాని, ఆరుగురు సీఎంలు, 11 మంది కేంద్రమంత్రులు ప్రచారం చేసినా ప్రజలు మాత్రం బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్‌ రాకుండా చేశారు. రాహుల్‌ గాంధీ వంటి జాతీయ నాయకుల మాటలను కూడా తెలంగాణ ప్రజలు విశ్వసించలేదు. కేసీఆర్‌కే పట్టం కట్టారు’అని పేర్కొన్నారు. ట్రక్కు గుర్తు అడ్డురాకుండా ఉండుంటే.. టీఆర్‌ఎస్‌ మరో 11 స్థానాలు ఖాతాలో చేరేవన్నారు. ఉత్తమ్, జానారెడ్డిలు మంత్రులుగా ఉన్నప్పటికీ.. ఏనాడూ నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్, సాగునీటి సమస్యలపై దృష్టి సారించలేదని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి చిత్తూరు జిల్లాకు వేల కోట్ల రూపాయలను తాగునీటి కోసం తరలించినా జానా, ఉత్తమ్‌ పదవులు పట్టుకుని వేలాడారని మండిపడ్డారు. నెలరోజుల్లో మిషన్‌ భగీరథ పూర్తయి ఇంటింటికి తాగునీరు రాబోతుందని, త్వరలోనే జిల్లాలో ఫ్లోరోసిస్‌భూతం కనుమరుగవుతుందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాతే 3,400 తండాలు గ్రామ పంచాయతీలు అయ్యాయి. 12 వేలకు పైచిలుకు గ్రామపంచాయతీలుంటే అందులో 25% గిరిజనులే సర్పంచ్‌లు కాబోతున్నారు. వీలైనంత వరకు ఏకగ్రీవాల కోసం ప్రయత్నించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

పార్టీలో చేరిన కోరుకంటి
తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌ కేటీఆర్‌ సమక్షంలో రామగుండం ఇండిపెం డెంట్‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదా రు వివేక్‌ హాజరయ్యారు. ‘చందర్‌కి ఏ అవసరమొచ్చినా నేను సహకరిస్తా’అని కేటీఆర్‌ అన్నారు. అనంతరం చందర్‌ మాట్లాడుతూ.. తనను టీఆర్‌ఎస్‌లో మళ్లీ చేర్చుకున్నందుకు సంతోషంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు. నాగార్జున సాగర్‌కు చెందిన భగవాన్‌ నాయక్, లక్ష్మారెడ్డి, అబ్బాస్‌లు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.

రామగుండంకు మెడికల్‌ కాలేజీ
‘రామగుండంలో కాంగ్రెస్‌ గెలవకపోవటం మన అదృష్టం. మన సోదరుడు గెలవటం సంతోషం. చందర్‌కు సతీవియోగం కలిగిన రోజే నేను సోమారపు ప్రచారానికి వచ్చాను. చాలా బాధ పడ్డాను. విభేదాలు పక్కన బెట్టి సోమారపుతో కలిసి పనిచేయాలని చందర్‌కు సూచించారు. రామగుండంలో మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేసి హామీ నిలబెట్టుకుంటాం. చందర్, సత్యనారాయణకు కలిసి లక్ష పైన ఓట్లు వచ్చాయి. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఈ ఓట్లు మనకు పడాలి మీ నియోజక వర్గ బాధ్యతలు నేను వ్యక్తిగతంగా తీసుకుంటా’అని పేర్కొన్నారు.

శివసాయికి చేయూత
పోలియో వ్యాధితో రెండు కాళ్లు దెబ్బతిన్న రామగుండం నియోజకవర్గానికి చెందిన బాలుడు శివసాయికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను ఎమ్మెల్యే చందర్‌తో పాటు కలిసిన శివసాయి తన గోడును వెళ్లబోసుకున్నాడు. బాలుడి దయనీయ స్థితికి స్పందించిన కేటీఆర్‌ తక్షణమే శివసాయిని ఆస్పత్రిలో చేర్పించాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ నేత కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌ని ఆదేశించారు. బాలుడి వైద్యానికయ్యే ఖర్చును భరిస్తానంటూ భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు