‘అది భారత్‌-పాక్‌ విభజన కన్నా కష్టం’

24 Sep, 2019 16:58 IST|Sakshi

సాక్షి, ముంబై: ఎన్నికల ప్రకటన వెలువడటంతో మహారాష్ట్రలో రాజకీయ వేడి మొదలైంది. పొత్తులపై అధికార విపక్ష పార్టీలు దూకుడుపెంచాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌, ఎన్సీపీ కలిసి పోటీ చేస్తున్నట్లు ఇది వరకే ‍ప్రకటించగా, అధికార బీజేపీ-శివసేన మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల ఒ‍ప్పందంపై శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందించారు. శివసేన-బీజేపీ మధ్య సీట్ల పంపకం భారత్‌-పాకిస్తాన్‌ దేశ విభజన కన్నా చాలా ​క్లిష్టమైన అంశమన్నారు.​ రాష్ట్రంలో రెండు అతిపెద్ద పార్టీల మధ్య సీట్ల పంపకం అంత సులువైన అంశంకాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇరుపార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, సీట్ల పంపకంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన తెలిపారు.

శివసేన మొదట్లో 50-50 ఫార్మూలాను ప్రతిపాదించిందని కానీ బీజేపీ నిరాకరించడంతో తామే వెనక్కి తగ్గామని రౌత్‌ వెల్లడించారు. అయితే తాము 130 సీట్లకు పైగా డిమాండ్‌ చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కాగా మహారాష్ట్రలోని  288 అసెంబ్లీ స్థానాలకు ఇదివరకే ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. దీంతో అధికార, విపక్ష పార్టీలు ఓ వైపు ప్రచారం చేస్తూనే..మరోవైపు సీట్ల పంపకాలపై కసరత్తులు చేస్తున్నాయి. అధివృద్ధి జపం చేస్తున్న బీజేపీ మరోసారి విజయంపై ధీమాగా ఉండగా.. సమర్థవంతమైన బీజేపీని ఎదుర్కొనేందుకు హస్తం కూడా పదునైన వ్యూహాలను సిద్ధం చేస్తోంది.

>
మరిన్ని వార్తలు