పొత్తులకు చెల్లు.. పోటీ ఫుల్లు

14 Apr, 2019 07:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూ లేనంత మంది అభ్యర్థులను నిలబెడుతోంది. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలుండగా, పార్టీ ఇంత వరకు  408 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కనీసం ఇంకో 30 మంది పేర్లు ప్రకటించాల్సి ఉందని పార్టీ సీనియర్‌ నాయకుడొకరు చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారే తమ పార్టీ ఎక్కువ మందిని పోటీకి నిలబెడుతోందని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ 428 మందిని పోటీలో దించింది. 1999లో 339 మంది, 2004లో 364 మంది, 2009లో 433 మంది బీజేపీ తరఫున పోటీ చేశారు. ప్రస్తుతానికి వస్తే, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లో కొందరు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. గతంలో బీజేపీ పలు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. దానిలో భాగంగా కొన్ని సీట్లు ఆయా పార్టీలకు వదిలింది. ఈసారి పొత్తులు పెద్దగా లేవు. గత ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో 42 సీట్లకు గాను 12 సీట్లలోనే బీజేపీ పోటీ చేసింది. ఈసారి తెలుగుదేశంతో పొత్తు లేకపోవడంతో మొత్తం 42 సీట్లలోనూ (ఏపీ, తెలంగాణ కలిపి) అభ్యర్థులను నిలబెట్టింది.ఇంతకు ముందు బీజేపీ తన బలాన్ని పెంచుకోవడం కోసం పొత్తులు కట్టి కొన్ని సీట్లను త్యాగం చేసింది. ఇప్పుడా పార్టీ తన కాళ్లపై తాను నిలబడింది. దాంతో పొత్తుల అవసరం లేకుండానే బరిలో దిగుతోంది. అంతేకాకుండా కొత్త ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దానివల్లే అభ్యర్థులు పెరుగుతున్నారు అంటూ కారణం వివరించారు ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌ అండ్‌ గవర్నెన్స్‌ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ఝా.

మరిన్ని వార్తలు