భారీ ఆశలతో బీజేపీ ఒంటరి పోరు

19 Nov, 2018 09:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణ ఎన్నికల్లో ఒంటరి పోరుతో అదృష్టాన్ని పరిక్షీంచుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. 119 నియోజకవర్గాల్లోని ఒక్క స్థానం మినహా అన్ని చోట్ల బీజేపీ బరిలోకి దిగింది. ఆరు విడతలుగా 118 నియోజకవర్గాల్లో  తమ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి అసెంబ్లీ టికెట్‌ను యువ తెలంగాణ పార్టీకి కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో(2014) టీడీపీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగిన బీజేపీ కేవలం 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇటీవల టీడీపీతో తెగదింపులు చేసుకున్న బీజీపీ అనూహ్యంగా ఒంటరి పోరుకు సిద్ధమైంది. అత్యధిక స్థానాల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మురం చేసింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలతో ప్రచారం చేయించనుంది. ఈ నెల 25,27,29 తేదీలలో అమిత్‌ షాతో సభలు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. వచ్చే నెల 3,5 తేదీలలో నరేంద్ర మోదీ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు సభల్లో పాల్గొంటారన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులను కూడా ప్రచారానికి ఆహ్వానించమన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌, పలువురు కేంద్రమంత్రులు ప్రచారంలో పాల్గొననున్నారు. మోదీ చరిష్మా, అమిత్‌ షా వ్యూహాలతో తాము విజయం సాధిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు