కలెక్టర్లపై పొగడ్తలు.. అనుమానాలకు తావు

23 Apr, 2019 17:44 IST|Sakshi
బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ(పాత చిత్రం)

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి మండిపడ్డారు. గుంటూరులో మంగళవారం కన్నా విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు పదేపదే ఈవీఎంలపై చేస్తోన్న గొడవ పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. తనకు సంబంధించిన కలెక్టర్లను పెట్టుకుని ఎన్నికలను మేనేజ్‌ చేస్తున్నారని ఆరోపించారు. దానిని ఎదుటివారిపై రుద్దుతున్నారని మండిపడ్డారు.  ముఖ్యమంత్రి తన రివ్యూలలో కలెక్టర్లను పొగడటం అనుమానాలకు తావిస్తోందన్నారు. 2014 ఎన్నికలు, నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులపై ఎన్నికల కమిషన్‌ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అలాగే కేంద్ర ఎన్నికల అధికారిని స్వయంగా వెళ్లి విచారణ జరపాలని కోరతామన్నారు.

కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాలో చంద్రబాబు ప్రచారానికి వెళ్లి సోనియా గాంధీ, ఏపీని బాగా విభజించిందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సోనియాగాంధీ ఏపీని బాగా విభజించిందన్నందుకు ఆంధ్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని  డిమాండ్‌ చేశారు. నిత్యం అబద్ధాలాడే వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని ఎన్నికల అధికారిని కోరితే ఇంతవరకూ స్పందించలేదని తెలిపారు. రూ.50 కోట్లు ఖర్చుపెట్టామని చెబుతున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు