2019 ఎన్నికలకు ‘టీ20’ ఫార్ములా

17 Sep, 2018 03:53 IST|Sakshi

ప్రతీ కార్యకర్త 20 ఇళ్లను సందర్శించేలా బీజేపీ కసరత్తు

కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారమే లక్ష్యంగా..

న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమైన బీజేపీ..  టీ20 ఫార్ములాతో విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రతీ కార్యకర్త వారి ప్రాంతంలోని 20 ఇళ్లను సందర్శించి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రచారం నిర్వహించడమే దీని లక్ష్యమని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడొకరు వెల్లడించారు. ఎలాగైనా మళ్లీ కేంద్రంలో అధికారం చేపట్టాలని బీజేపీ అగ్రనాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకనుగుణంగా టీ20 ఫార్ములాతో పాటు ‘హర్‌ బూత్‌ దస్‌ యూత్‌’(ప్రతి పోలింగ్‌ బూత్‌కు 10 మంది యువత), నమో యాప్‌కు మరింత మంది అనుసంధానం, బూత్‌ స్థాయిలో బృందాల ఏర్పాటు వంటి వాటితో ప్రతి ఇంటికి తమ ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రచారం చేయాలని కార్యకర్తలకు లక్ష్యాల్ని నిర్దేశిస్తోంది.  

2014 కంటే మరింత ఉధృతంగా..
ప్రభుత్వ పథకాలపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక, బూత్‌ స్థాయి కార్యకర్తలు వారి వారి ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన పెంచాలని బీజేపీ ఇప్పటికే ఆదేశించింది. ప్రజలతో నేరుగా సంభాషించడమే కాక వారితో అనుసంధానం కావడమే దీని లక్ష్యమని సీనియర్‌ నేత పేర్కొన్నారు. 2014 కంటే ఇప్పుడు ప్రచార ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగించాలనే లక్ష్యంతో బీజేపీ కసరత్తు చేస్తోంది.  

నేరుగా ప్రధాని సంభాషణ: మరోవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోగా దేశంలోని మెజార్టీ నియోజవర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడాలనే ఆలోచనలో ప్రధాని మోదీ ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నేరుగా ప్రధానితో సంభాషించడం కార్యకర్తల్లో ప్రేరణ నింపుతుందన్నాయి.

మరిన్ని వార్తలు