త‍్వరలో తెలంగాణ, ఏపీకి నూతన బీజేపీ అధ్యక్షులు

20 Feb, 2020 14:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లనుందని మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత విద్యాసాగర్‌రావు అన్నారు. ఆయన గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ..‘ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి నూతన అధ్యక్షులు రాబోతున్నారు. ఎవరు అధ్యక్షుడు అయినా అందరిని కలుపుకుని ముందుకు వెళతాం. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నయ రాజకీయ శక్తిగా అవతరించాం. అలాగే ఏపీలోనూ త్వరలో మార్పులు రాబోతున్నాయి. (మార్చి 15 రాష్ట్రానికి అమిత్షా)

(ఫైల్‌ ఫోటో)

తెలంగాణలో నయా నిజాం పాలన కొనసాగుతోంది. సీఏఏలో ఎలాంటి ఇబ‍్బందులు లేనప్పటికీ రాజకీయ అవసరాల కోసమే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లీస్‌లు వ్యతిరేకిస్తున్నాయి. ఆర్టికల్‌ 370, రామ మందిరం, ట్రిపుల్‌ తలాక్‌ వంటి అంశాలలో ప్రధాని మోదీకి వస్తున్న ఆదరణ చూడలేకే సీఏఏపై వివాదం చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆలోచనలు దేశానికే నష్టం కలిగించేలా ఉన్నాయి. వీటిని అణగదొక్కేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఎన్నార్సీపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయినా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. జాతి సమైక్యతకు ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్‌ల అవసరం ఎంతో ఉంది. ముస్లిం యువత జాతీయ జెండాతో బయటకు వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముస్లిం యువత వందేమాతరం, జనగణమణ ఆలపించి కార్యక్రమాన్ని ముగించగలరా? (సీఏఏకు వ్యతిరేక నిర్ణయం చరిత్రాత్మకం)

తెలంగాణలో సెప్టెంబర్‌ 17ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పోరాటం చేస్తుంది. కర్ణాటక, మహారాష్ట్రలో జరుగుతున్నప్పటికీ తెలంగాణలో జరగకపోవడం సరికాదు. అంతర్జాతీయ మాతృభాషను ఘనంగా జరుపుకుని తెలుగు భాషను పరిరక్షించుకోవాలి. మాతృభాష ఔన‍్నత్యాన్ని చాటిచెప్పడమే లక్ష్యంగా రేపు హైదరాబాద్‌ వేదికగా కార్యక్రమం జరుగుతోంది. ఇంట్లో ఒక భాష, పాఠశాలలో ఒక భాష ...ఇలా విద్యార్థులలో సంఘర్షణ లేకుండా చూడాలి’  అని అన్నారు. (సీఏఏపై వెనక్కి వెళ్లం)

మరిన్ని వార్తలు