‘ఆ నేతల అసలు రంగు ఇదే’

12 Aug, 2019 14:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. జమ్మూ కశ్మీర్‌లో ముస్లింలు అధికంగా ఉన్నందునే బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న చిదంబరం వ్యాఖ్యలపై కాషాయ పార్టీ విరుచుకుపడింది. ఆర్టికల్‌ 370 రద్దుపై చిదంబరం వ్యాఖ్యలతో అలాంటి నేతల అసలు రంగు బయటపడిందని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ దుయ్యబట్టారు. ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ట మసకబారడంతో వారిని ఆకర్షించేందుకు ఆ పార్టీ తంటాలు పడుతోందని ఎద్దేవా చేశారు.

దేశంలో వంద కోట్ల పైబడిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ట్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370, ఆయుష్మాన్‌ భారత్‌లపై చిదంబరం, గులాం నబీ ఆజాద్‌ల వంటి నేతల అసలు రంగు బయటపడుతోందని మండిపడ్డారు. మరోవైపు ఆర్టికల్‌ 370 రద్దుపై కాంగ్రెస్‌ నేతల తీరును కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ తప్పుపట్టారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌ ప్రజలు స్వాగతిస్తుంటే పాకిస్తాన్‌ ప్రభుత్వానికి బాసటగా పాక్‌ ఉగ్రసంస్ధల ప్రతినిధిలా కాంగ్రెస్‌ మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని ప్రయత్నించే శక్తులకు మద్దతు ఇస్తోందని విమర్శించారు.

మరిన్ని వార్తలు