మేఘాలయ సారథి కన్రాడ్‌

5 Mar, 2018 01:31 IST|Sakshi
కన్రాడ్‌ కే సంగ్మా

రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం

ఎన్పీపీ సారథ్యంలో కొలువుదీరనున్న సంకీర్ణ సర్కారు

గవర్నర్‌కు ఎమ్మెల్యేల మద్దతు లేఖలు

సర్కారులో బీజేపీతో పాటు మరో మూడు పార్టీలు

షిల్లాంగ్‌:  మేఘాలయలో కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీజేపీ, ఇతర పక్షాల మద్దతుతో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్పీపీ) అధ్యక్షుడు కన్రాడ్‌ కే సంగ్మా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మేఘాలయ కొత్త సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్పీపీ సారథ్యంలో బీజేపీ, మరో మూడు పార్టీల సంకీర్ణ కూటమి తరఫున ఆదివారం రాత్రి గవర్నర్‌ గంగా ప్రసాద్‌ను కలిసిన కన్రాడ్‌ సంగ్మా.. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తమకు మొత్తం 34 మంది ఎమ్మెల్యేల మద్దతుందని పేర్కొంటూ ఎమ్మెల్యేల మద్దతు లేఖల్ని అందచేయగా.. ప్రభుత్వ ఏర్పాటుకు కన్రాడ్‌ను గవర్నర్‌ ఆహ్వానించారు. ఇక ఈ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ తరఫున ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆ పార్టీ అగ్రనేతలు కమల్‌నాథ్, అహ్మద్‌ పటేల్‌లు రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదు.  కాగా మేఘాలయ సీఎం ముకుల్‌ సంగ్మా తన పదవికి రాజీనామా చేశారు. సంగ్మా రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.  

ఉమ్మడి ఎజెండా మేరకు పనిచేస్తాం: కన్రాడ్‌
గవర్నర్‌ను కలిసిన అనంతరం కన్రాడ్‌ సంగ్మా మాట్లాడుతూ.. ‘ఎన్పీపీకి చెందిన 19 మంది, యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ(యూడీపీ) నుంచి ఆరుగురు,  పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) నుంచి నలుగురు, హిల్‌ స్టేట్‌ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(హెచ్‌ఎస్‌పీడీపీ) నుంచి ఇద్దరు, బీజేపీకి చెందిన ఇద్దరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు లేఖల్ని గవర్నర్‌కు సమర్పించాం’ అని చెప్పారు. సంకీర్ణ సర్కారును నడిపించడం అంత సులువైన విషయం కాదని, అయితే మాకు మద్దతిస్తోన్న పార్టీలు ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి అజెండా మేరకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ పీఏ సంగ్మా కుమారుడే కన్రాడ్‌ సంగ్మా.. 2016లో తండ్రి మరణం అనంతరం తుర స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.  

కాంగ్రెస్‌ ప్రతిపాదనను తిరస్కరించా
సంకీర్ణ సర్కారులో కన్రాడ్‌ సంగ్మానే సీఎం అవ్వాలన్న షరతుపై మద్దతిచ్చేందుకు అంగీకరించామని యూడీపీ అధ్యక్షుడు డొంకుపర్‌ రాయ్‌ తెలిపారు. మేఘాలయలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, తమ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్, యూడీపీలు చెరి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా తనను కలిసి మాజీ సీఎం ముకుల్‌ సంగ్మా ప్రతిపాదించగా తిరస్కరించానని, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అంతకముందు రాయ్‌ను బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు కలిసి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు పోటాపోటీగా..
మేఘాలయలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడడంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం శనివారం మధ్యాహ్నం నుంచి కాంగ్రెస్, ఎన్పీపీలు పోటాపోటీగా పావులు కదిపాయి. అతి పెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్‌ శనివారం రాత్రే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. కమల్‌నాథ్, అహ్మద్‌ పటేల్, సీపీ జోషీలు మేఘాలయ చేరుకుని మంత్రాంగం నడిపించారు. ఇతర చిన్న పార్టీలతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం దక్కలేదు. ‘నిబంధనల మేరకు అతి పెద్ద పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా మమ్మల్నే ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరాం’ అని కమల్‌నాథ్‌ తెలిపారు. మేఘాలయలో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్‌ 21 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.

మరిన్ని వార్తలు