మహారాష్ట్ర: వాళ్లంతా తిరిగి వచ్చేందుకు సిద్ధం!

30 Nov, 2019 12:21 IST|Sakshi

ముంబై : ఉద్ధవ్‌ ఠాక్రే సర్కారు అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సిద్ధమైన వేళ మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మహా వికాస్ అఘాది(శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీ) అధికారం చేపట్టిన క్రమంలో అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌ కాళిదాస్‌ను తొలగించి.. ఆయన స్థానంలో దిలీప్‌ వాల్సే పాటిల్‌ను ఆ పదవిలో నియమించారు. ఆయన నేతృత్వంలోనే నేడు ప్రభుత్వ విశ్వాస పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో కాళిదాస్‌ను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌.. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా అసెంబ్లీ స్పీకర్‌ అభ్యర్థిగా కిసాన్‌ కాథోడ్‌ను బీజేపీ ప్రకటించింది. మరోవైపు కూటమి సర్దుబాటులో భాగంగా స్పీకర్‌ పదవి దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ నానా పటోలేను తమ అభ్యర్థిగా ప్రకటించింది.

ఇదిలా ఉండగా... ఠాక్రే తొలి కేబినెట్‌లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ రెవెన్యూ, పీడబ్ల్యూడీ, ఎక్సైజ్‌ శాఖలను దక్కించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా ఎన్సీపీకి హోం, ఆర్థిక, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఫారెస్ట్‌ వంటి కీలక శాఖలు దక్కే అవకాం ఉంది. ఇక సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, నీటి పారుదల శాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది. విద్య, పరిశ్రమలు వంటి శాఖలకు సంబంధించిన పంపకాల్లో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు సమాచారం.


అసెంబ్లీ స్పీకర్‌ అభ్యర్థిగా కిసాన్‌ కాథోడ్‌ను ప్రకటించిన బీజేపీ

ఇక ఠాక్రే సర్కారు శనివారం మధ్యాహ్నం విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న వేళ ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌.. బీజేపీ ఎంపీ ప్రతాపరావు చికాలికర్‌తో సమావేశంతో కావడంతో రాజకీయ వర్గాల్లో అలజడి రేగింది. అయితే తాను మర్యాపూర్వకంగానే ప్రతాపరావును కలిశానని అజిత్ స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదే విధంగా ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కాంగ్రెస్‌, ఎన్సీపీ నాయకులు తిరిగి సొంతగూటికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం రాష్ట్ర పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా