బీజేపీ కులం కార్డు

23 Mar, 2019 08:42 IST|Sakshi

యూపీలో ఆరు చోట్ల సిట్టింగ్‌ల మార్పు

ఎంత సిద్ధాంతానికి కట్టుబడిన పార్టీ అయినా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి కుల సమీకరణాలకు తలొగ్గక తప్పదని బీజేపీ నిరూపించింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ (ఎస్పీ)–బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) కూటమికి దీటుగా నిలిచేందుకు చివరి నిమిషంలో ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. కుల సమీకరణాలతో లబ్ధి పొందే ఎలాంటి అవకాశాన్ని విపక్ష కూటమి ఇవ్వకుండా ఉండేందుకే బీజేపీ ఈ మార్పులు చేసింది. అభ్యర్థులను మార్చిన ఆరు నియోజకవర్గాల్లో నాలుగు రిజర్వుడు నియోజకవర్గాలే.

ఆగ్రాలో మొదట కేంద్ర మాజీ మంత్రి రాంశంకర్‌ కతేరియాను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన స్థానంలో రాష్ట్ర మంత్రి ఎస్‌పి సింగ్‌ బఘేల్‌ను ఎంపిక చేశారు. షాజహాన్‌పూర్‌లో సిట్టింగ్‌ ఎంపీ కృష్ణ రాజ్‌ బదులు అరుణ్‌ సాగర్‌ను నిలబెట్టారు. ఇక, బదాన్‌ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థిగా ధర్మేంద్ర యాదవ్‌ బరిలో ఉన్నారు. ఆయనపై పోటీకి బీజేపీ సంఘమిత్ర మౌర్యను దింపింది. సంఘమిత్ర తండ్రి స్వామి ప్రసాద్‌ మౌర్య బీఎస్పీ అధినేత మాయావతికి నమ్మిన బంటు. ఆయన కూతురును పోటీకి పెట్టడం ద్వారా నియోజకవర్గంలో యాదవేతర ఓట్లను రాబట్టుకోవచ్చని కమలనాథుల ఆశ. హర్దోయి, మిస్రిక్‌ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎంపీలపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో బీజేపీ ఆ ఇద్దరినీ కూడా మార్చింది.

మరిన్ని వార్తలు