‘నిజాం ఆగడాలు విన్నాం...ఇప్పుడు చూస్తున్నాం’

17 Sep, 2019 11:35 IST|Sakshi

రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం

సాక్షి, హైదరాబాద్‌ : చరిత్రను తవ్వితే లాభం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త భాష్యం చెబుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. మంగళవారం తెలంగాణ విమెచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తేనే విమోచన దినోత్సవం అధికారకంగా నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. సెప్టెంబర్ 17న తిరంగా యాత్ర నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు.

ఈ క్రమంలో ఊరి నిండా జాతీయ జెండా నినాదంతో.. పల్లె పల్లెలో జాతీయ పతాకాలు ఎగురవేస్తున్నామని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ‘యాదాద్రిపై కేసీఆర్ బొమ్మ చెక్కించుకున్నారు. నిజాం ఆగడాలు విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం’ అని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.(చదవండి : తెలంగాణలో ‘విమోచనం’ గల్లంతు)

మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు
సర్దార్‌ వల్లభబాయ్‌ పటేల్ దూరదృష్టితో తెలంగాణ కు విమోచనం లభించిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. హైదరాబాద్ విలీన అంశాన్ని పటేల్ డీల్ చేసి విముక్తి కల్పించారు. కశ్మీర్‌ను అంశాన్ని డీల్‌ చేసిన నెహ్రూ 370 ఆర్టికల్ పేరుతో ఆ ప్రాంతాన్ని సమస్యాత్మకంగా మార్చారు. నేడు ప్రధాని మోదీ, అమిత్ షా చొరవతో కశ్మీర్ సమస్య పరిష్కారమైంది. 370 ఆర్టికల్ రద్దు అయ్యింది అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోకేసీఆర్ కారుపై మజ్లీస్ సవారీ చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ‘కారు రిమోట్ మజ్లీస్ చేతిలో ఉంది. రాజు గారి కుక్క చనిపోతే డాక్టరును సస్పెండ్ చేస్తారు. మనుషుల ప్రాణాలంటే కేసీఆర్‌కు లెక్కలేదు’ అని ఘాటుగా విమర్శించారు.

మరిన్ని వార్తలు