రంగంలోకి అమిత్‌షా.. ఏమైనా జరగొచ్చు!

19 Jun, 2018 13:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రంగ ప్రవేశంతో జమ్ము కశ్మీర్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మంగళవారం ఉదయం ఉన్నపళంగా రావాలంటూ జమ్ము కశ్మీర్‌ బీజేపీ ఎమ్మెల్యేలకు సమన్లు జారీ చేయటంతో.. వారంతా హస్తిన చేరుకున్నారు. ఈ క్రమంలో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ)-బీజేపీ పొత్తు తెగదెంపుల దాకా వెళ్లిందా? అన్న కోణంలో జాతీయ మీడియాలో వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి. 

రంజాన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలానుసారం నెల రోజుల పాటు భారత సైన్యం కాల్పుల విరమణను పాటించింది. వేర్పాటువాదులతో చర్చలకు ఇదే మంచి తరుణమని జమ్ము కశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ.. కేంద్రం నిర్ణయాన్ని ప్రశంసించారు. అయితే సరిగ్గా రంజాన్‌కు రెండు రోజుల ముందు 'ది రైజింగ్ కశ్మీర్' సంపాదకుడు సుజాత్ భుకారీ హత్య, ఆపై ఆర్మీ రైఫిల్ మ్యాన్ ఔరంగజేబును ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణను పక్కనబెట్టి, చర్యలకు ఉపక్రమించాలని సైన్యానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది పీడీపీ వర్గాలకు ఏ మాత్రం సహించలేదు. 

కాల్పుల విరమణను మరికొంత కాలం పొడిగించి ఉంటే శాంతిచర్చలు ఓ కొలిక్కి వచ్చి ఉండేవేమోనని ఆమె భావించారు. కానీ, హఠాత్తుగా(తమను మాట వరుసకు కూడా సంప్రదించకుండా) కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముఫ్తీ జీర్ణించుకోలేకపోయారు. కశ్మీర్‌లో పరిస్థితులు మళ్లీ అదుపు తప్పుతాయన్న ఆందోళనలో ఆమె ఉన్నారు. ఇప్పటికే చాలా అంశాల్లో పీడీపీ-బీజేపీల మధ్య విభేదాలు ఉండగా, కాల్పుల విరమణపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మెహబూబా ముఫ్తీ అసంతృప్తితో రగలిపోతున్నారు. ఈ తరుణంలో అమిత్‌ షా నుంచి పిలుపు అందుకున్న కశ్మీర్‌ బీజేపీ ఎమ్మెల్యేలు.. భేటీ కావటం విశేషం. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి, భద్రతాంశాలపై ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నేతలతో అమిత్ షా చర్చించనున్నట్లు బోగట్టా. అదే సమయంలో పీడీపీతో విడిపోతే వచ్చే పరిస్థితులపైనా చర్చించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం సాగుతున్న తీరుపై బీజేపీ నేతల్లోనూ అసంతృప్తి పెరిగిపోయినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు