యూపీ బీజేపీ చీఫ్‌కు షాక్‌!

19 Mar, 2019 18:32 IST|Sakshi

లక్నో : కేంద్రంలో అధికారంలో ఉండాల్సిన పార్టీని నిర్ణయించడంలో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి షాక్‌ తగిలింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీ యూపీ చీఫ్‌ మహేంద్రనాథ్‌ పాండే సోదరుడి కోడలు అమృతా పాండే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. యూపీ తూర్పు ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సమక్షంలో బుధవారం హస్తం కండువా కప్పుకుంటానని పేర్కొన్నారు.

అన్ని వర్గాలను బీజేపీ మోసం చేసింది..
కాంగ్రెస్‌ పార్టీలో చేరడం గురించి అమృతా పాండే మాట్లాడుతూ.. ‘ఇప్పుడు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం ఏమాత్రం ఉండదు. కాంగ్రెస్‌ హవా వీస్తుంది. భవిష్యత్తు కాంగ్రెస్‌ పార్టీదే. అసలు మోదీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న విషయం కూడా స్పష్టంగా తెలియదు. బ్రాహ్మణులతో పాటు అన్ని వర్గాలను బీజేపీ మోసం చేసింది. నాకు టికెట్‌ దక్కుతుందా లేదా అన్న విషయంపై ఆసక్తి లేదు. కేవలం ప్రియాంక గాంధీతో కలిసి పనిచేయడమే నా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు.

ఇక యూపీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రియాంక గాంధీ సోమవారం గంగా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.  లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు. అలహాబాద్‌ నుంచి వారణాసి వరకు గంగా నదిలో బోటు ద్వారా 100 కిలోమీటర్ల దూరం ఆమె ప్రయాణించనున్నారు.(‘ప్రియాంక’ గంగాయాత్ర)

మరిన్ని వార్తలు