టీఆర్‌ఎస్‌ పాలనకు ముగింపు పలకాలి

3 Jul, 2018 14:56 IST|Sakshi
ప్రజలతో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌   

జగిత్యాలటౌన్‌ : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలనకు ముగింపు పలకాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్‌ అన్నారు. జనచైతన్యయాత్రలో భాగంగా సోమవారం జగిత్యాలకు చేరుకున్నారు. కొత్తబస్టాండ్‌ నుంచి అంగడిబజార్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని అమలు పర్చడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు.

కాంగ్రెస్‌పాలనలో దగా పడ్డ తెలంగాణను టీఆర్‌ఎస్‌ అవినీతి మయంలో ముంచిందన్నారు. దేశాన్ని పాలించడం కాంగ్రెస్‌ జన్మహక్కు అనే విధంగా వ్యవహరిస్తోందని, 2 శాతం ఓటర్లు ఉన్న రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్‌ కంచుకోటలను మోడీ కూల్చారని, అలాగే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందన్నారు.

దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చి మోసం చేశారని, దళితులపై దాడులు పెరిగాయని, దీనికి నేరెళ్ల సంఘటనే ఉదాహరణగా పేర్కొన్నారు. 2012లో డీఎస్సీ ప్రకటించినా.. ఇప్పటికీ అతీగతీలేదన్నారు. ఇంకా నాలుగు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మంది ఉద్యోగ విరమణ చేశారని, ఇంటికో ఉద్యోగం ఏమైందని ప్రశ్నించారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు పర్మినెంట్‌ చేస్తామన్న కేసీఆర్‌ ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ప్రభుత్వంగా ప్రజలే మారుస్తారన్నారు.

రేషన్‌డీలర్లకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన నిధులను ఇవ్వకుండా 14 వేలమంది రేషన్‌ డీలర్లను రోడ్డుపాలు చేశారని ఆరోపించారు. నిజాంల మెడలు వంచి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తెలంగాణకు విముక్తి కల్పిస్తే గల్లీలో ఉన్న మజ్లిద్‌ పార్టీని ఢిల్లీకి పంపించిన ఘనత టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌దేనన్నారు. ఉత్తర తెలంగాణలో గల్ఫ్‌ బాధితులు పెరిగిపోతున్నారని, సీఎం బిడ్డ ఎంపీ కవిత పట్టించుకోవడం లేదని, గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ అమలు ఏమైందన్నారు.

తెలంగాణ చిన్నమ్మ సుష్మస్వరాజ్‌ విదేశాల్లో ఉన్న బాధితులను స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేస్తోందన్నారు. మెట్‌పల్లి షుగర్‌ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చి ఫ్యాక్టరీ యజమాన్యంతో లాలూచీ పడి తెరిపించలేకపోతున్నారన్నారు. చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించేందుకు బతుకమ్మ చీరలకోసం కోట్లాది నిధులు మంజూరు చేసి నాణ్యత లేని సూరత్‌ చీరలను తెప్పించి తెలంగాణ ఆడబిడ్డలకు అందజేయడం బాధాకరమన్నారు.

ఇటు చేనేత కార్మికులను అపహాస్యం చేస్తూ ఆడబిడ్డలకు అవమానం జరిగిందన్నారు. బీజేపీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కౌలురైతు చట్టం డ్వాక్రా గ్రూపులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. జనచైతన్య యాత్ర పార్టీ యాత్ర కాదని, నాలుగున్నర కోట్ల ప్రజల యాత్ర అన్నారు.

ఈ కార్యక్రమంలో కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, కిసాన్‌ మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్‌ కమిటీ చైర్మన్‌ మోరపల్లి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, యెండల లక్ష్మినారాయణ, గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సీపెల్లి రవీందర్, సత్యం, అనుమల్ల కృష్ణహరి, రమేశ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు