ఇది మా నాన్న వద్దనుకున్న శాలువా..

30 Jan, 2019 12:02 IST|Sakshi

మాయావతిపై యూపీ బీజేపీ చీఫ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై చిందులు తొక్కుతున్న బీజేపీ నేతలు బీఎస్పీ అధ్యక్షురాలు, యూపీ మాజీ సీఎం మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా.. యూపీ బీజేపీ చీఫ్‌ ఎంఎన్‌ పాండే ఆ జాబితాలో చేరారు. మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న సోషల్‌ మీడియాలో ఒక వీడియో చూశాను. ఎస్పీ-బీఎస్పీ పొత్తు సందర్భంగా అఖిలేష్‌ యాదవ్‌ మాయావతికి శాలువా కప్పుతున్న వీడియో అది. ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఉన్నప్పుడు ఇది మా నాన్న కప్పుకునేవారు. కానీ, 1995 గెస్ట్‌హౌజ్‌ ఘటన తర్వాత ఆయన తన ఒంటి మీది నుంచి ఈ శాలువా తీసేశారు. మళ్లీ మీకు కప్పుతున్నా.. అని అఖిలేష్‌ మనసులో అనుకుంటున్నట్టుగా వీడియో కింద రాసుకొచ్చాడు’  అని పాండే ఉటంకించారు.

కాగా, పాండే వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిగా రాజకీయాలు చేస్తే వీళ్లదేం పోయిందంటూ బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్‌ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. యూపీలో ఎస్పీ–బీఎస్పీ పొత్తుపై ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..‘అధికారం కోసం గౌరవాన్ని వదులుకున్న మాయావతి తనపై దాడిచేసిన వారితోనే చేతులు కలిపారు. ఆమె ఆడజాతికే కళంకం లాంటిది. అసలు మాయావతి ఆడో, మగో చెప్పలేం. ఆమె హిజ్రా కంటే అధ్వానమైన వ్యక్తి’ అని దుర్భాషలాడారు. కాగా, 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో 38-38 చొప్పున పోటీ చేస్తామని ఎస్పీ-బీఎస్పీ ప్రకటించాయి.

మరిన్ని వార్తలు