దూకుడు పెంచాల్సిందే

21 Oct, 2019 03:23 IST|Sakshi

ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో బీజేపీ పాత్రపై అరుణ్‌ సింగ్‌

హుజూర్‌నగర్‌లో సత్తా చాటాలి

మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీదే అధికారం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారంలో బీజేపీ దూకుడు పెంచడంతోపాటుగా హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ఆదేశించారు. బీజేపీ పక్షాన ఆర్టీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులకు ఆయన సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్, ప్రధాన కార్యదర్శులు మనోహర్‌ రెడ్డి, ప్రేమేందర్‌ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల నేతలు హాజరైన ఈ సమావేశంలో హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలు, రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె, బీజేపీ అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలు చర్చించారు.

అనంతరం అరుణ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అకారణంగా ఇబ్బందులకు గురిచేస్తోందని, కార్మికులను ఇంతలా అణచివేస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. 50 వేలమంది కార్మికులు చేస్తోన్న సమ్మెపై హైకోర్టు జోక్యం చేసుకున్నా టీఆర్‌ఎస్‌ మాత్రం స్పందించడం లేదన్నారు.

ఆర్టీసీ కార్మికులు చేసిన రాష్ట్రబంద్‌లో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు అనేక మందిని అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కార్మికుల పక్షాన పోరాటం చేసిన వారిని ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయలేదని, కావాలంటే టీఆర్‌ఎస్‌ నాయకులు పరిశీలించుకోవచ్చన్నారు. గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ‘గాంధీ సంకల్ప యాత్ర’కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.

డిసెంబర్‌లో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
బీజేపీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో భాగంగా డిసెంబర్‌ నాటికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికను పూర్తి చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈనెల 30 లోపు రాష్ట్రంలోని 34వేల బూత్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని, 891 రూరల్‌ మండలాలు, డివిజన్‌ కమిటీలను నవంబర్‌ 10 లోగా పూర్తి చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలు పూర్తయిన తర్వాత వచ్చే నెలాఖారు నాటికి జిల్లా కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీల్లో పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు