బీజేపీకి ఎన్‌ఆర్‌సీ ఎదురుదెబ్బ!

29 Apr, 2019 20:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘దేశంలోకి వచ్చిన వలసదారులను తన్ని తరిమేయాలా, లేదా? వారు మన దేశ వనరులను చెదల్లా తినేస్తున్నారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సీ) కార్యక్రమాన్ని చేపడతామని, సరైన డాక్యుమెంట్లులేని అక్రమ వలసదారులను దేశం నుంచి పంపిస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా పేర్కొంది. దీన్ని సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నా సరే, మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ప్రయాణించినప్పుడల్లా చెబుతున్నారు. బీజేపీ ప్రతిపాదించిన ఎన్‌ఆర్‌సీ ప్రకారం బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన అక్రమ ముస్లిం వలసదారులను గుర్తించి వారిని వెనక్కి పంపించడం, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు పౌరసత్వం కల్పించడం ఉద్దేశం. తద్వారా హిందువులందరి మద్దతు కూడగట్టడం బీజేపీ లక్ష్యం.

ఈ ప్రచారం ద్వారానే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో హిందువులను సమీకరించడం ద్వారా బీజేపీ కాస్త బలపడింది. ఈలోగా అస్సాంలో నిర్వహించిన ఎన్‌ఆర్‌సీ కసరత్తు పార్టీకి ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. ఒక్క ముస్లింలే కాకుండా వేల సంఖ్యలో హిందువులు, ఆదివాసీలకు ఎన్‌ఆర్‌సీలో చోటు లభించకుండా పోయింది. ఈ విషయమై అక్కడి ప్రజలు ఇప్పటికీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అలాంటి భయమే బంగ్లాదేశ్‌ నుంచి ఎక్కువగా బెంగాల్‌కు వలసవచ్చిన హిందువులకు పట్టుకుంది. సరైన పత్రాలు లేని కారణంగా తమను కూడా దేశం నుంచి పంపించి వేస్తారని వారు భయపడుతున్నారు. ఆ భయాన్ని మమతా బెనర్జీ తనకు సానుకూలంగా మలచుకుంటున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అక్రమవసలదారుల్లో హిందువులు కూడా దేశం నుంచి తరిమేస్తారని ఆమె హెచ్చరిస్తున్నారు.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా ఎన్‌ఆర్‌సీ వల్ల ఒక్క ముస్లింలే దేశం నుంచి విడిచి వెళ్లి పోవాల్సి వస్తోందని, హిందువులకు అలాంటి భయం అవసరం లేదని అమిత్‌ షా చెప్పలేక పోతున్నారు. ఎన్నికల కోడ్‌ ప్రకారం మతాలను ప్రస్థావిస్తు మాట్లాడరాదు. ఈ కారణంగా బీజేపీకి ఇంతకుముందు ఆశించినన్ని సీట్లు బెంగాల్‌లో రాకపోవచ్చని రాజకీయ పండితులు అంచనావేస్తున్నారు.

మరిన్ని వార్తలు