మేయర్‌ పీఠం వద్దు.. ప్రతిపక్షంలో ఉంటాం

26 Jan, 2020 12:47 IST|Sakshi

బలంలేదు ప్రతిపక్షంలో కూర్చుంటాం : ఎంపీ అరవింద్‌

టీఆర్‌ఎస్‌, ఎంఐఎంకు లైన్‌క్లియర్‌

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌ మేయర్‌పై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఆదివారం ప్రకటించారు. మేయర్‌ కోసం కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ తమకు రాలేదని అన్నారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం మద్దతుతో పాటు ఎక్స్‌అఫీషియా సభ్యులు ఓటింగ్‌ పరంగా కూడా టీఆర్‌ఎస్‌కు ఎక్కువ బలం ఉన్నందున తాము వెనక్కి తగ్గుతున్నామని అరవింద్‌ పేర్కొన్నారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్‌ స్థానం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే.

మొత్తం 60 డివిజన్లలో 28 స్థానాల్లో గెలుపొంది బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. టీఆర్‌ఎస్‌కు 13 స్థానాలు దక్కగా, ఎంఐఎం 16, కాంగ్రెస్‌ రెండు, స్వతంత్ర అభ్యర్థి మరో డివిజన్‌లో గెలుపొందారు. దీంతో మేయర్‌ పీఠం కోసం ఉన్న అవకాశాలను పరిశీలించిన అరవింద్‌.. కష్టతరంగా మారటంతో ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధపడ్డారు. దీంతో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి కార్పొషన్‌ మేయర్‌ను కైవసం చేసుకోనున్నాయి. దీని కోసం ఇప్పటికే ఇరుపార్టీల నేతలు మంతనాలు ప్రారంభించాయి. నిజామాబాద్‌లో మద్దతు ఇస్తే తమకు బోధన్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఎంఐఎం పట్టుపడుతున్నట్లు సమాచారం. (టీఆర్‌ఎస్‌తో ఎంఐఎం జతకట్టే అవకాశం!)

ఆదివారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలను అడ్డుకుని అభివృద్ధికి పాటు పడతామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. కేసీఆర్‌కు దమ్ముంటే సీఏఏను అడ్డుకుని తీరాలని సవాల్‌ విసిరారు. సీఏఏపై తీర్మానం చేసే హక్కు అసెంబ్లీకి లేదని, పార్లమెంట్‌ చేసిన చట్టాన్ని అందరూ ఆమోదించి తీరాలని అరవింద్‌ స్పష్టం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేశారని, ఆధారాలతో నిరూపిస్తే కేసీఆర్‌ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, త్వరలోనే టీఆర్‌ఎస్‌ భూస్థాపితం కానుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని ముగిసిన చరిత్ర అని ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి 28 సీట్లు ఇచ్చిన నిజామాబాద్‌ ప్రజలకు అరవింద్‌ ధన్యవాదాలు తెలిపారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు