నాకు కాంగ్రెస్‌లో చాలా నష్టం జరిగింది..

20 Mar, 2019 08:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా హస్తానికి హ్యాండ్‌ ఇచ్చి... జంప్‌ జిలానీలు అవుతున్నారు. తాజాగా మాజీమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత డీకే అరుణ... బుధవారం అర్థరాత్రి భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ చేరిన అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు చాలా నష్టం జరిగిందని, పార్టీ నేతలపై అధిష్టానానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. చదవండి...(బీజేపీలోకి డీకే అరుణ)

గౌరవం లేని చోట ఉండటం ఇష్టం లేకనే పార్టీ మారినట్లు డీకే అరుణ తెలిపారు. దేశంలోనూ, తెలంగాణలోనూ కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిందని ఆమె వ్యాఖ్యలు చేశారు. కేవలం అధికారం కోసమో, మరో ప్రయోజనం కోసమో లాలూచీ పడ్డవారే టీఆర్ఎస్‌లో చేరుతున్నారని ఆమె విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత కుమ్ములాటల వల్లే పార్టీ పరాజయాల పాలవుతుందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించగలిగేది ఒక్క బీజేపీ మాత్రమేనని, కేసీఆర్‌ను ఓడించాలంటే రాష్ట్రంలో మరో జాతీయ పార్టీ అవసరం అని డీకే అరుణ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. అందుకే టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజల మంచి చేకూరుతుందన్నారు.

కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డీకే అరుణ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి  చేతిలో పరాజయం పొందారు. అప్పటి నుంచి ఆమె టీ పీసీసీపై అసంతృప్తిగా ఉన్నారు. ఓ వైపు మాజీ హోంమంత్రి కాంగ్రెస్‌ను వీడి... టీఆర్ఎస్‌లో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీకే అరుణ బీజేపీలో చేరడం హాట్‌ టాఫిక్‌గా మారింది. మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

మరోవైపు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. మంగళవారమే అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ప్రకటన వెలువడలేదు. 

మరిన్ని వార్తలు