కేజ్రీవాల్‌పై రూ.500 కోట్ల దావా వేసిన బీజేపీ

13 Jan, 2020 08:22 IST|Sakshi

ఆప్‌ ప్రచార గీతంపై మనోజ్‌ తివారీ ఫిర్యాదు

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార వేడి పెరిగింది. అధికార, విపక్ష పార్టీలైన ఆమ్‌ఆద్మీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించిన ఢిల్లీ బీజేపీ చీఫ్‌, ఎంపీ మనోజ్‌ తివారీ సీఎం కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆప్‌ ఇటీవల విడుదల చేసిన ‘లగే రహో కేజ్రీవాల్‌’ అనే ప్రచారం గీతంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పాట తన బోజ్‌పురి సంగీత అల్బమ్‌కు చెందిన ఎడిటెడ్‌ వెర్షన్ అని, తన పాటను కాపీ చేసే హక్కు ఆప్‌ సర్కార్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. (ఊపేస్తున్న.. ‘లగే రహో కేజ్రీవాల్‌’)

దీనిపై తాను న్యాయపోరాటానికి దిగుతానని, తన మేధో సంపత్తి హక్కులు ఉపయోగించుకున్నందుకు రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసినట్లు మనోజ్‌ తివారీ ప్రకటించారు. అలాగే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశానని అన్నారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపామన్నారు. అబద్దాలను ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు కేజ్రీవాల్‌ ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో​ బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్‌పై ఆప్‌ ఓ ప్రచార గీతాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘లగే రహో కేజ్రీవాల్‌’ అంటూ సాగే ఈ ప్రచారం గీతం ఢిల్లీ ప్రజలను విశేషంగా అకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. (తేలని సీఎం అభ్యర్థి.. మోదీపైనే భారం!)

మరిన్ని వార్తలు