కన్యాకుమారి.. వరించేదెవరిని!

18 Apr, 2019 03:51 IST|Sakshi
పొన్‌ రాధాకృష్ణన్‌, హెచ్‌.వసంతకుమార్‌

కన్యాకుమారి

తీర ప్రాంతంలో బీజేపీ–కాంగ్రెస్‌ సై

బీజేపీ తమిళనాడులో 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం కన్యాకుమారి. ఇక్కడ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌.. కాంగ్రెస్‌ ప్రత్యర్థి హెచ్‌.వసంతకుమార్‌ను 1.28 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. వీరిద్దరే మళ్లీ తలపుడుతున్నారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమిలో బీజేపీ, డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌ చేరడంతో ఈ రెండు ప్రధాన ప్రాంతీయ పక్షాలు పోటీలో లేవు.

నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి జే హెలెన్‌ డేవిడ్‌సన్‌.. బీజేపీ అభ్యర్థి పొన్‌ రాధాకృష్ణన్‌ను 65 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో బీజేపీ బలపడుతోంది. ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లున్న కన్యాకుమారి స్థానంలో 15 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. పోలింగ్‌ గురువారం జరగనుంది. నియోజకవర్గాల పునర్విభజనలో నాగర్‌కోయిల్‌ స్థానం రద్దయి 2009లో కన్యాకుమారి ఏర్పాటైంది. ప్రస్తుతం ఇక్కడ రెండు జాతీయ పక్షాల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉందనీ, గెలుపుపై జోస్యం చెప్పడం కష్టమని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

1999లో నాగర్‌కోయిల్‌ నుంచి రాధాకృష్ణన్‌..
1999 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. ఈ ఎన్నికల్లో పొన్‌ రాధాకృష్ణన్‌ నాగర్‌కోయిల్‌ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. 2004 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన సీపీఎం అభ్యర్థి ఏవీ బెలార్మిన్‌ చేతిలో ఓడిపోయారు. కన్యాకుమారి నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ఉన్న బీసీ వర్గం నాడార్‌ కులానికి చెందిన రాధాకృష్ణన్‌ జనాదరణ కలిగిన నాయకుడు. నియోజకవర్గంలోని 19 లక్షల జనాభాలో సగం మంది హిందువులు. క్రైస్తవులు 40–45 శాతం వరకు ఉన్నారు. ఎన్నికల్లో మతపరమైన విభజన బీజేపీకి అనుకూలాంశం.

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న రాధాకృష్ణన్‌ 2013లో ఈ ప్రాంతంలోని పేద హిందువులందరికీ స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలంటూ సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. ధనికులైన మైనారిటీలకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారనీ, హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఈ ఆందోళన ఉధృతంగా సాగింది. మంత్రి అయ్యాక రాధాకృష్ణన్‌ ఈ విషయంలో చేసిందేమీ లేదనే అసంతృప్తి స్థానికుల్లో ఉంది. మత్స్యకారులు తమ ఉత్పత్తులను కొచ్చి, తూత్తుకుడి వంటి దూర ప్రాంతాలకు పంపే అవసరం లేకుండా వారి కోసం కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యం కల్పిస్తానని బీజేపీ అభ్యర్థి హామీ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే–కాంగ్రెస్‌ హవా
2016 అసెంబ్లీ ఎన్నికల్లో కన్యాకుమారి పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లను డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి కైవసం చేసుకుంది. రెండు పార్టీలూ మూడేసి స్థానాలు గెలుచుకున్నాయి. పేదలకు నెలకు రూ.6 వేల సహాయ పథకంతోపాటు తనను గెలిపిస్తే వ్యవసాయ, విద్యా రుణాలు మాఫీ చేయిస్తానని కాంగ్రెస్‌ అభ్యర్థి వసంత కుమార్‌ ప్రస్తుత ఎన్నికల్లో హామీ ఇస్తున్నారు. వసంతకుమార్‌ కూడా నాడార్‌ వర్గానికి చెందిన నాయకుడే. నియోజకవర్గంలో టెక్నోపార్క్‌ ఏర్పాటు చేయిస్తానని ఆయన వాగ్దానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచీలున్న రిటైల్‌ సంస్థ వసంత్‌ అండ్‌ కంపెనీ స్థాపకుడైన వసంత్‌కుమార్‌ ఈసారి గెలుపునకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు
► సగం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నా గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ సంక్షోభం కుంగదీస్తోంది. రైతులకు మేలు చేసే విధానాలు అమలు చేయకపోవడంతో గిట్టుబాటు ధరలు లేక వారు అల్లాడుతున్నారు. జీడిపప్పు దిగుమతి నిబంధనలు సడలించడంతో ఈ రంగంలోని ఫ్యాక్టరీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.

► రహదారుల విస్తరణతో వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గిపోతోంది. జలవనరులు కుంచించుకుపోతున్నాయి. ఇవన్నీ ఎన్నికల్లో చర్చకు వస్తున్నాయి.

► ఎన్డీఏ సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కోలాచల్‌లో ఏర్పాటు చేస్తామన్న కంటెయినర్‌ టెర్మినల్‌ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చాక సమీపంలోని ఇనాయంకు తరలించారు. తమ జీవనోపాధికి ఈ ప్రాజెక్టు నష్టదాయకమంటూ స్థానిక మత్స్యకారులు ఆందోళన చేశారు. చివరికి ఈ ప్రాజెక్టును కోవలంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కాని, కోలాచల్, ఇనాయం, తెంగైపట్టినం వంటి తీర ప్రాంతాల్లోని  క్రైస్తవులైన లక్ష మందికి పైగా మత్స్యకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

► రాధాకృష్ణన్‌కు కన్యాకుమారి, నాగర్‌కోయిల్‌లో చెప్పుకోదగ్గ బలం ఉంది. తీర ప్రాంతాల్లో బీజేపీ మద్దతుదారుల సంఖ్య తక్కువ. తన గెలుపు తీర ప్రాంత ప్రజల తీర్పుపై ఆధారపడి ఉండటంతో ఈ ప్రాంత ప్రజల సమస్యలు ఈసారి తప్పక పరిష్కరిస్తానని బీజేపీ అభ్యర్థి హామీ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు