రఫేల్‌పై పోటాపోటీగా నోటీసులు

18 Dec, 2018 03:53 IST|Sakshi

మోదీపై కాంగ్రెస్, రాహుల్‌పై బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాలు

న్యూఢిల్లీ: రఫేల్‌ ఒప్పందంపై అధికార, ప్రతిపక్షాల మధ్య పోరు మరింత తీవ్రమవుతోంది. పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సోమవారం సభా హక్కుల నోటీసు ఇచ్చింది. దీనికి ప్రతిగా బీజేపీ ఎంపీలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా అలాంటి నోటీసే ఇచ్చారు. కాంగ్రెస్‌ పంపిన నోటీసు తనకు అందిందని, దాన్ని పరిశీలిస్తున్నట్లు జీరో అవర్‌లో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చెప్పారు.

రఫేల్‌ ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఎందుకిచ్చారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ ఉభయ సభల్లో సభా హక్కుల తీర్మానాల్ని ప్రవేశపెట్టింది. రాజ్యసభలో గులాం నబీ ఆజాద్‌.. చైర్మన్‌ వెంకయ్య నాయుడుకు, లోక్‌సభలో మల్లికార్జున ఖర్గే.. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను ఈ నోటీసులు అందజేశారు. మరోవైపు, రఫేల్‌ ఒప్పందంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు అనురాగ్‌ ఠాకూర్, నిశికాంత్‌ దూబే, సంజయ్‌ జైశ్వాల్‌..కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు పంపారు. కాగా, రఫేల్‌ విషయంపై అధికార, విపక్షాల  నినాదాలతో సోమవారం లోక్‌సభ మూడుసార్లు వాయిదా పడింది.  దీంతో రెండు సభలు పెద్దగా కార్యకలాపాలు చేపట్టకుండానే మంగళవారానికి వాయిదా పడ్డాయి.‡

రఫేల్‌పై కాగ్‌ ముసాయిదా నివేదిక
రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై కాగ్‌(కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) తొలి ముసాయిదా నివేదికను రక్షణ శాఖకు పంపింది. నివేదికలోని అంశాలపై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని కోరింది. అయితే ఈ నివేదికను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు లేనట్లేనని సమాచారం.

మరిన్ని వార్తలు