షుగర్‌ బెల్ట్‌లో ఎవరిది పవర్‌?

22 Apr, 2019 07:30 IST|Sakshi

శరద్‌పవార్‌కు పెట్టని కోట అయిన షుగర్‌ బెల్ట్‌లోని సొంత నియోజకవర్గం బారామతిలో ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. మహారాష్ట్రలోని బారామతి పార్లమెంటు నియోజకవర్గంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడూ, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడూ శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలేని ఓడించేందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా యత్నిస్తోంది. బారామతిలో రెండు పర్యాయాలు విజయఢంకా మోగించి, ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగిన సుప్రియకి గట్టిపోటీ ఇవ్వగల బలమైన స్థానిక అభ్యర్థిని నిలబెట్టాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సూచన మేరకు రాష్ట్రీయ సమాజ్‌ పక్ష (ఆర్‌ఎస్పీ) నాయకుడూ, ఎమ్మెల్యే రాహుల్‌ కుల్‌ భార్య కంచన్‌ కుల్‌ను బరిలోకి దింపారు.

అయితే శరద్‌ వారసురాలిగా సుప్రియకు గతంలోనే దక్కిన గుర్తింపు ఈసారి సైతం దక్కనుందా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓ పక్క శరద్‌పవార్‌ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడంతో ఆయన కుమార్తెకే పవర్‌ దక్కుతుందనే ఆశాభావంతో నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ ధీమాతో ఉంది. మరాఠా ప్రజల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న పవార్‌ కుటుంబానికి అదే సామాజిక వర్గానికి చెందిన అజిత్‌ పవార్‌ భార్యకి దగ్గరి బంధువు కంచన్‌ కుల్‌ కూడా గట్టిపోటీ ఇస్తారనే భావన కూడా జనంలో వ్యక్తమవుతోంది.

ఎవరీ కంచన్‌ కుల్‌?
శరద్‌ పవార్‌ సొంత నియోజకవర్గంలో ఆయన సొంత కూతురు సుప్రియపై కంచన్‌ రాహుల్‌ కుల్‌ పోటీ చేస్తున్నారు. ప్రముఖ నింబోల్కర్‌ కుటుంబానికి చెందిన కంచన్‌ కుల్‌ బారామతిలోనే జన్మించారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ భార్య, సునేత్రకి కంచన్‌ కుల్‌ దగ్గరి బంధువు కూడా కావడం విశేషం. కంచన్‌ కుల్‌ భర్త రాహుల్‌ కుల్‌ ఆర్‌ఎస్పీ శాసనసభ్యుడు. 2014 ఎన్నికల్లో ఆర్‌ఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాహుల్‌ కుల్‌ తొలుత నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు. బారామతిలో బీజేపీ అభ్యర్థి పెద్ద మెజారిటీతో గెలుస్తారని అమిత్‌షా ఢంకా బజాయించి చెబుతున్నారు. పవార్‌ కుటుంబం గతమెన్నడూ లేని విధంగా హోరాహోరీ జరిగిన పోరుకు 2014 ఎన్నికలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి. 2014లో సుప్రియకి ఆర్‌ఎస్పీ వ్యవస్థాపకుడు మహదేవ్‌ జంకర్‌ గట్టిపోటీ ఇవ్వడంతో ఈసారి కూడా అదే పార్టీ నుంచి కంచన్‌ కుల్‌ బరిలోకి దిగడంతో గెలుపు ఎవరిని వరిస్తుందన్న ఆసక్తి నెలకొంది.

ఎన్‌సీపీ పట్టు..
పవార్‌ సొంత నియోజకవర్గంలో బీజేపీ–శివసేన పట్టు సాధించేందుకు చేసిన ప్రయత్నమల్లా తమంతట తాముగా తమ బలాన్ని పెంచుకోవడం కాకుండా ఎన్‌సీపీ–కాంగ్రెస్‌ నాయకులను తమ పార్టీలోకి తెచ్చుకోవడంపై ఆధారపడటం గమనించాల్సిన విషయం. 2014లో బీజేపీ శివసేన ఈ ప్రాంతంలోని మొత్తం 10 సీట్లలో ఐదింటిని గెలుచుకోగలిగింది. ఎన్‌సీపీ నాలుగు సీట్లూ, బీజేపీ–శివసేన పొత్తులోని స్వాభిమాన్‌ షేట్కారీ సంఘటన (ఎస్‌ఎస్‌ఎస్‌) ఒక్క సీటుని గెలుచుకోగలిగాయి. అయితే ఈసారి గెలుపు కోసం ఇరు వర్గాలూ హోరాహోరీ పోరాడుతున్నాయి.

రైతుల అసంతృప్తి..
ఒకపక్క బీజేపీ–శివసేన నాయకులు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించిన ఈ పార్లమెంటు స్థానంలో తమ పునాదులను కాపాడుకోవడం కోసం షెట్కారీ సంఘటన సహా కాంగ్రెస్‌ –ఎన్‌సీపీ నాయకులు సైతం ఈ స్థానంలో తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తన సొంత నియోజకవర్గంలో సర్వశక్తులనూ ఒగ్గయినా కుమార్తెను గెలిపించుకునేందుకు పాటు పడుతున్నారు. పవార్‌.. తనకు పట్టున్న షుగర్‌ బెల్ట్‌లో తన బలాన్ని నిరూపించుకోవడం ద్వారానే జాతీయ రాజకీయాల్లో తన స్థానాన్ని నిలబెట్టుకోగలరన్న అభిప్రాయంతో ఎన్‌సీపీ ఉంది. మరోవైపు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన కాంగ్రెస్‌ పార్టీ తన పునాదులను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.

గ్రామీణ ప్రాంత ఓట్లే కీలకం..
2011 జనాభా లెక్కల ప్రకారం పూనేలోని బారామతి పార్లమెంటు నియోజకవర్గంలో 22,89,007 జనాభా ఉంటే అందులో అత్యధికంగా 82.82 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే. కేవలం 17.18 శాతం మంది పట్టణ ప్రజలున్నారు. షెడ్యూల్డ్‌ కులాలు, జాతులు 12.51, 2.06 శాతంగా ఉన్నాయి. 2016 గణాంకాల ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం 19,22,205 మంది ఓటర్లున్నారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో 58.83 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే 2009లో ఇక్కడ పోలింగ్‌ కేవలం 46.07 శాతమే నమోదైంది.

సుప్రియా సూలేకి కలిసొచ్చే అంశాలు
యూపీఏ ప్రభుత్వంలో శరద్‌ పవార్‌ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండగా రైతులకు రుణమాఫీ చేయడం రైతాంగంలో మంచి పేరు తెచ్చింది. అలాగే మహిళా సాధికారత కోసం సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులను ఏర్పాటు చేయడం, ‘విద్యా ప్రతిష్ఠాన్‌’ కింద అత్యధిక సంఖ్యలో విద్యాసంస్థల ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలు పవార్‌ ఫ్యామిలీ పవర్‌ని బలోపేతం చేశాయి. ఈ అంశాలే ఇప్పుడు సుప్రియా సూలే ప్రచార సరళిని ఊపందుకునేలా చేశాయి. తండ్రి శరద్‌ పవార్‌ నుంచి ఏం నేర్చుకున్నారన్న ప్రశ్నకి బదులుగా ‘లోతైన అధ్యయనం, కష్టపడే తత్వం’ అని సమాధానమిచ్చారు తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న సుప్రియా సూలే. అయితే తను ఇచ్చే హామీలపైనా, తన ఆచరణపైనా స్థానిక ప్రజలకు అపారమైన నమ్మకముందనీ, అదే తనకు ఓట్లు కుమ్మరిస్తుందనీ సుప్రియా సూలే ఆశాభావంతో ఉన్నారు.

                       2014 ఎన్నికల చిత్రం
గెలుపొందిన అభ్యర్థి            సుప్రియా సూలే (ఎన్సీపీ)
వచ్చిన ఓట్లు                    5,21,562
ఓడిపోయిన అభ్యర్థి            మహదేవ్‌ జగన్నాథ్‌ జంకర్‌ (ఆర్‌ఎస్పీ)
వచ్చిన ఓట్లు                   4,51,843
మొత్తం ఓటర్లు                18,13,543
పోలైన ఓట్లు                 10,66,556

మరిన్ని వార్తలు