ఆ వ్యాఖ్యలను సీఎం విజ్ఞతకే వదిలేద్దాం!

6 Mar, 2018 01:10 IST|Sakshi

ప్రధాని గురించి కేసీఆర్‌ వ్యాఖ్యలపై బీజేపీ కోర్‌ కమిటీ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీని కించపరిచేలా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మాట్లాడారంటూ కొన్నిరోజులుగా చేస్తున్న నిరసనలను ఇక విరమించుకోవాలని బీజేపీ నిర్ణయించింది. తాను అసలు కించపరిచే పదాలను వాడలేదంటూ సీఎం కేసీఆర్‌ ఇటీవల విలేఖరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. పొరపాటున నోరుజారి ఆ పదం దొర్లి ఉంటుందంటూ సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయని, సీఎం కొడుకు, కూతురు ఆ వ్యాఖ్యలను గుర్తించినా సీఎం మాత్రం తాను అనలేదంటూ పేర్కొనటంతో ఇక దాన్ని ఆయన విజ్ఞతకే వదిలేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.

తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పే అంశాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ చెప్పారు. సోమవారం రాత్రి పార్టీ కోర్‌ కమిటీ సమావేశానంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. బీజేపీ బలపడటాన్ని చూసి కేసీఆర్‌ భయపడే ఇప్పుడు కొత్త ఫ్రంట్‌ అనే నాటకాన్ని తెరపైకి తెచ్చారన్నారు. బీజేపీని ఇంకా బలోపేతం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు.

నిరుద్యోగులను కేసీఆర్‌ ప్రభుత్వం వంచించిన విషయాన్ని యువతలోకి తీసుకెళ్తామన్నారు. గత అసెంబ్లీ సమావేశాలప్పుడు బీజేవైఎం కార్యకర్తలు చలో అసెంబ్లీ నిర్వహిస్తే స్పందించిన సీఎం అసెంబ్లీలో స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు దాన్ని విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో మళ్లీ అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తామన్నారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు