ప్రచార వేగం పెంచిన బీజేపీ

3 Apr, 2019 03:09 IST|Sakshi

మోదీ సభ సక్సెస్‌తో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం 

నిజామాబాద్‌ లేదా కరీంనగర్‌లో మరో సభకు కసరత్తు 

మరో నాలుగు చోట్ల అమిత్‌షా సభలకు చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీ సభ సక్సెస్‌తో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన ప్రయోజనాలు, రాష్ట్ర వైఫల్యాలు ఎండగడుతూ మరింతగా దూసుకుపోయేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్య నేతలు వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు గత నెల 29న మహబూబ్‌నగర్‌ సభకు హాజరైన మోదీ.. సోమవారం ఎల్‌బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు కూడా హాజరయ్యారు.

ఈ సభ విజయవంతం కావడంతో మరో సభను నిర్వహించాలని బీజేపీ శ్రేణులు నిర్ణయానికి వచ్చాయి. దీనిలో భాగంగా నిజామాబాద్‌ లేదా కరీంనగర్‌లో మరో బహిరంగ సభ నిర్వహిస్తామని, అందుకు అంగీకరించాలని రాష్ట్ర పార్టీ మోదీని కోరింది. ఆయన ఆమోదం లభించగానే సభ నిర్వహణకు ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు మంగళవారం నిజమాబాద్, మహబూబాబాద్‌లో జరిగిన బహిరంగ సభకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరయ్యారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సభలను నాలుగు పార్లమెంటు నియోజవకర్గాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం ఆయన ఇప్పటికే ఆమోదం తెలపడంతో ఆ ఏర్పాట్లపై దృష్టి సారించింది.  

రాష్ట్రానికి రానున్న ప్రముఖులు.. 
ఈ నెల 4న వరంగల్, కరీంనగర్, 6న నల్లగొండ, హైదరాబాద్‌లలో అమిత్‌షా సభలను నిర్వహించేలా బీజేపీ చర్యలు చేపట్టింది. ఈ నెల 5న సుష్మా స్వరాజ్, 7న ముఖ్తార్‌ అబ్జాస్‌ నఖ్వీ హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించేలా ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం (3న) రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ఖమ్మంతో పాటు నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని కొల్లాపూర్‌లో జరిగే సభలకు హాజరు కానున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ కూడా తెలంగాణలో ప్రచారం చేసేలా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని వార్తలు