మహిళలకు 15 స్థానాలు

20 Nov, 2018 01:53 IST|Sakshi

తేలిన బీజేపీ సామాజిక వర్గాల వారీ లెక్క

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ పోటీలో నిలుపుతున్న అభ్యర్థుల సామాజిక వర్గాల వారీ లెక్క తేలింది. రాష్ట్రంలోని 119 స్థానాలకు గాను 118 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. ఒక్క భువనగిరి స్థానాన్ని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి కేటాయించేందుకు అంగీకరించడంతో ఆ స్థానంలో తమ అభ్యర్థిని పోటీలో నిలుపలేదు. ఇక నారాయణ ఖేడ్‌ స్థానంలో తమ అభ్యర్థిని మార్పు చేసింది. అక్కడి నుంచి రవికుమార్‌ను పోటీలో నిలిపేందుకు మొదట్లో నిర్ణయించినా చివరి క్షణంలో ఆయనకు బదులు సంజీవరెడ్డికి బీఫారం ఇచ్చింది.

ఇక బీజేపీ ప్రకటించిన 118 స్థానాల్లో ఓసీలకు 50 స్థానాలను కేటాయించగా, బీసీలకు 33 స్థానాలను కేటాయించింది. ఎస్సీలకు 21 స్థానాలను, ఎస్టీలకు 12 స్థానాలను, మైనారిటీలకు 2 స్థానాలను కేటాయించింది. ఇందులో మహిళలకు మొత్తంగా 15 స్థానాలను కేటాయించడం విశేషం. రాష్ట్రంలోని అన్ని పార్టీల కంటే బీజేపీనే మహిళలకు ఎక్కువ స్థానాలను కేటాయించింది. టీఆర్‌ఎస్‌ 4 స్థానాలను కేటాయించగా, కాంగ్రెస్‌ 11 స్థానాలను కేటాయించింది. ఇక బీఎల్‌ఎఫ్‌ 11 స్థానాలను, టీడీపీ 1 స్థానాన్ని, టీజేఎస్‌ ఒక స్థానాన్ని, సీపీఐ ఒక స్థానాన్ని కేటాయించగా.. బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధికంగా 15 స్థానాలను కేటాయించింది.

మరిన్ని వార్తలు