ఢిల్లీ కూడా దక్కలేదు!

12 Feb, 2020 02:20 IST|Sakshi
‘విజయం మమ్మల్ని అహంకారులను చేయదు. అలాగే ఓటమి కుంగదీయదు’ అంటూ ఢిల్లీ బీజేపీ ఆఫీసు బయట మంగళవారం వెలసిన ఓ పోస్టర్‌

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ.. హోంమంత్రి అమిత్‌ షా..పెద్ద సంఖ్యలో కేంద్రమంత్రులు.. సుమారు 300 మంది ఎంపీలు..గల్లీగల్లీకి తిరిగి ప్రచారం చేపట్టినా బీజేపీకి ఫలితం దక్కలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రెండు ర్యాలీల్లో ప్రసంగించగా, హోం మంత్రి అమిత్‌షా 60 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, 300 మంది ఎంపీలు వచ్చినా ప్రజల మనస్సును మార్చలేకపోయారు. పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలివి. అసెంబ్లీలోని 70 స్థానాలకు గాను 45కు పైగా సీట్లు గెలుచుకుంటామని నడ్డా ధీమా వ్యక్తం చేసినా 8 చోట్ల మాత్రమే గెలవడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు.

1993లో 48 శాతం ఓట్లతో ఢిల్లీ అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ..గత 2015 ఎన్నికల్లో 32 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఈసారి మాత్రం ఓట్ల శాతాన్ని 38కి పెంచుకోవడం ఒక విధంగా ఊరట కలిగించే అంశమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మిత్రపక్షాలు జేడీయూ, ఎల్‌జేపీకి వచ్చిన ఓట్లతో కలుపుకుంటే ఇది 40 శాతం వరకు ఉంటుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వర్గీయ తెలిపారు. ఆప్‌కు కేజ్రీవాల్‌ పెద్ద అండ కాగా ప్రజాదరణ పొందిన స్థానిక నేతలెవరూ లేకపోవడం బీజేపీ వైఫల్యానికి ప్రధాన కారణమనేది కొందరి మాట. కేంద్ర మంత్రి హర్షవర్థన్‌ వంటి స్థానిక నేతలను పక్కనబెట్టిన కేంద్ర నాయకత్వం స్థానికేతరుడిగా భావించే మనోజ్‌ తివారీకి పెద్దపీట వేయడం కూడా ఢిల్లీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.

మరిన్ని వార్తలు