సిగ్గులేని ప్రభుత్వం.. రాష్ట్రపతి పాలన పెట్టండి

14 May, 2018 18:07 IST|Sakshi
మమతా బెనర్జీ.. బాబుల్‌ సుప్రియో (జత చేయబడిన చిత్రం)

బెంగాల్‌ పంచాయితీ ఎన్నికల హింసపై బీజేపీ ఎంపీ ధ్వజం

కోల్‌కతా: పంచాయితీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో నెలకొన్న హింసాత్మక ఘటనలపై బీజేపీ స్పందించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించిపోయాయని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతోంది. ఈ మేరకు కేం‍ద్రమంత్రి, అస్నాసోల్‌ ఎంపీ బాబుల్ సుప్రియో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో అధికార తృణమూల్‌ రాజ్యాంగ సూత్రాలను పాటించట్లేదు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తోంది’ అని టీఎంసీపై విమర్శలు గుప్పించారు.

‘ఉదయం నుంచి జరిగిన పరిణామాలు నాకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే టీఎంసీ ఓ రౌడీల పార్టీ. మమతా బెనర్జీ ప్రభుత్వం సుపారీలు ఇచ్చి ఎన్నికల్లో హింసను ప్రేరేపించింది.  ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు. నైతికత అంతకన్నా లేదు. తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి. అప్పుడే బెంగాల్‌ ప్రజలు ప్రశాంతంగా బతకగలుగుతారు’ అని బాబుల్‌ ఓ మీడియా ఛానెల్‌తో పేర్కొన్నారు. కాగా, తృణమూల్‌ నేత, పశ్చిమ బెంగాల్‌ మంత్రి రవీంద్రనాద్‌ ఘోష్‌, పోలింగ్‌ బూత్‌ వద్దనున్న బీజేపీ ఏజెంట్‌పై దాడి చేసిన ఘటనను ఈ సందర్భంగా బాబుల్‌ ప్రస్తావించారు.

పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌ అధికార బలంతో  ఓటర్లను మభ్యపెడుతోందని,  తృణమూల్‌ కార్యకర్తలు కర్రలు, ఇనుప రాడ్లతో బీజేపీ కార్యకర్తలపై ఇష్టానుసారం దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.మరోవైపు ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ఆయన తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే పంచాయితీ ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగిన చెలరేగిన ఘర్షణలో ఐదుగురు ఓటర్లు మరణించగా, 25 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు