మగవాళ్లంతా రేపిస్టులు కారు: స్మృతి ఇరానీ 

13 Dec, 2019 13:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం రేగింది. అత్యాచార ఘటనల నేపథ్యంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు రేపిస్టులను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని బీజేపీ విమర్శించింది. ఈ క్రమంలో రాహుల్‌ క్షమాపణ చెప్పాలంటూ అధికార పార్టీ ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అత్యాచార పర్వాలు కొనసాగడం గురించి రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ... ‘ ఇది మేకిన్‌ ఇండియా కాదు. రేపి ఇన్‌ ఇండియా’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోదీ సొంత పార్టీ ఎమ్మెల్యే ఓ యువతిపై అత్యాచారం చేసినా.. ఆయన స్పందించడం లేదని విమర్శించారు. 

ఈ నేపథ్యంలో కేంద్ర శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ రాహుల్‌ వ్యాఖ్యలను లోక్‌సభలో ప్రస్తావించారు. ‘ భారత మహిళలపై అత్యాచారాలకు పాల్పడాలంటూ ఓ నాయకుడు పిలుపునివ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. తన వ్యాఖ్యలతో రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. ఆయనను శిక్షించాల్సిందే. తన వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణ చెప్పి తీరాలి అని డిమాండ్ చేశారు. ‘ మగవాళ్లంతా రేపిస్టులు కారు. రాహుల్‌ వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి. 50 ఏళ్ల వయస్సు పైబడుతున్నా రాహుల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదే విధంగా మరో బీజేపీ ఎమ్మెల్యే లోకేత్‌ ఛటర్జీ స్పందిస్తూ... ‘పరిశ్రమల అభివృద్ధికై ప్రధాని మోదీ మేకిన్‌ ఇండియా అంటే రాహుల్‌జీ మాత్రం రేపిన్‌ ఇండియా అంటున్నారు. మహిళలపై అత్యాచారాలను ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఇది భారత మహిళలకు, భరతమాతకు ఘోర అవమానం’ అని రాహుల్‌ తీరుపై మండిపడ్డారు. అయితే ఈ సమయంలో రాహుల్‌ సభలో లేరు. ఆయన వచ్చే సరికే లోక్‌సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు బయట విలేకరులతో మాట్లాడిన రాహుల్‌.. రేపిన్‌ ఇండియా వ్యాఖ్యలపై తాను క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. ‘ప్రధాని మేకిన్‌ ఇండియా గురించి మాట్లాడుతుంటే.. ప్రతీ వార్తా పత్రికలో అత్యాచారాల గురించే కనిపిస్తోందని అన్నాను. ఈ విషయంలో నేను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు’ అని రాహుల్‌ పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసనలపై దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఇలాంటి చవకబారు చర్యలకు దిగుతోందని విమర్శించారు.


 

మరిన్ని వార్తలు