సంఖ్య తగ్గినా బీజేపీదే మెజారిటీ

1 Jun, 2018 02:42 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల వరుసగా ఉప ఎన్నికల్లో ఓటమిపాలవుతున్నప్పటికీ.. ప్రస్తుతానికి లోక్‌సభలో బీజేపీకి వచ్చిన సమస్యేమీ లేదు. తాజా ఉప ఎన్నికల ఫలితాల అనంతరం.. లోక్‌సభలో బీజేపీ బలం 272 (స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ను కలుపుకుని) గా ఉంది. మొత్తం 543 స్థానాల్లో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ముగ్గురు కర్ణాటక సభ్యులు ఇటీవల రాజీనామా చేయగా.. కశ్మీర్లోని అనంత్‌నాగ్‌ సీటు కూడా ఏడాదిగా ఖాళీగా ఉంది. మొత్తం 539 సీట్లను పరిగణనలోకి తీసుకుంటే లోక్‌సభలో కావాల్సిన మెజారిటీ 271. ఇద్దరు నామినేటెడ్‌ సభ్యులను జతచేరిస్తే 541 సంఖ్యకు గానూ 272 మెజారిటీ అవసరం. వీరిద్దరిని కలుపుకుంటే బీజేపీకి 274 మంది సభ్యుల మద్దతుంది. ఎన్డీయే కూటమికి 315 మంది సభ్యుల బలముంది. 2014 ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు గెలుచుకోగా, ఎన్డీయే బలం 336 గా ఉంది. అయితే పలు ఉప ఎన్నికలు, టీడీపీ తెగదెంపుల అనంతరం ఈ సంఖ్య 315కు చేరింది. 

మరిన్ని వార్తలు