కలగా.. కమల వికాసం

28 Oct, 2017 09:53 IST|Sakshi

నాయకత్వ లోపంతో ఎదగని బీజేపీ

టీడీపీ పొత్తుతో నియోజకవర్గాల్లో ఎదగని నాయకత్వం

ఉమ్మడి ఆదిలాబాద్‌లో నైరాశ్యంలో పార్టీ శ్రేణులు

వలస నేతల పీఛేమూడ్‌

అధికార పార్టీ తప్పులు కూడా జనంలోకి తీసుకెళ్లని వైనం

పార్టీ రాష్ట్ర సమావేశాలతోనైనా ఊపు వస్తుందా?

మంచిర్యాలలో నేటినుంచి రెండు రోజులు రాష్ట్రకార్యవర్గ సమావేశాలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అన్నీ ఉన్నా... అల్లుని నోట్లో శని అనే సామెత ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి అతికినట్లు సరిపోతుంది. కేంద్రంలో అధికారంలో ఉండీ, పార్టీకి అండగా కార్యకర్తల యంత్రాంగం ఉన్నా... ప్రజల్లోకి వెళ్లడంలో పార్టీ నాయకత్వం విఫలమవుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా శాసనసభ నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం లేక ఓటర్ల ముందుకు వెళ్లలేకపోయిన పార్టీ... ఇప్పటికైనా సెగ్మెంట్ల వారీగా ఎదిగేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేకపోతోంది. మాట్లాడితే టీఆర్‌ఎస్‌కుప్రత్యామ్నాయం అని చెప్పుకునే కమలనాథులు నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై గానీ, ప్రజల సమస్యలపై గానీ రోడ్లపైకి వచ్చిన సంఘటనలను వేళ్లమీద లెక్కించవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, పది అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉన్నప్పటికీ, నైరాశ్యంతో అడుగు ముందుకు పడడం లేదు. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను మంచిర్యాలలో నిర్వహిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ రాష్ట్ర నేతలతో పాటు జాతీయ స్థాయిలో పేరున్న నాయకులు హాజరయ్యే ఈ సమావేశాలతోనైనా స్థానిక నాయకత్వం నిద్ర లేస్తుందో లేదో వేచి చూడాలి.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అదే తీరు..
ఆదిలాబాద్, మంచిర్యాల, ముథోల్, సిర్పూర్, నిర్మల్‌ నియోజకవర్గాల్లో బీజేపీ సానుభూతిపరులు ఎక్కువ. ఆయా ప్రాంతాల్లో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఉనికి చాటుకుంది కూడా. మున్సిపాలిటీల పరిధిలో కూడా పార్టీకి ఓటర్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే నిత్యం ప్రజల్లో ఉంటే తప్ప గుర్తింపు లభించని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నరేంద్రమోదీ హవానే వచ్చే ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందన్న ధీమాతో నాయకులు కదలడం లేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీజేపీ సైద్ధాంతిక విధానాలకు విరుద్ధంగా తీసుకునే మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అక్కడక్కడ ఆందోళనలు జరిగినా, ఇక్కడ పార్టీ ప్రకటనలతోనే సరిపుచ్చుకుంది. టీఆర్‌ఎస్‌ హామీలైన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు భూ పంపిణీ, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు వంటి అంశాల్లో కూడా బీజేపీ ఉమ్మడి జిల్లాల నాయకత్వం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ప్రజా సమస్యలపై పోరాటాలతోనే ప్రజాభిమానం సాధ్యమవుతుందన్న విషయాన్ని జిల్లాల నాయకత్వం మరిచిపోవడంతో పార్టీ ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయింది.

వలస నేతల పీఛేమూడ్‌!
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల అనంతరం బీజేపీకి దేశవ్యాప్తంగా వచ్చిన ఊపు ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కూడా కనిపించింది. పార్లమెంటరీ కస్టర్ల సమావేశాల పేరుతో ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాల్లో జరిపిన మీటింగ్‌లు కొత్త ఉత్సాహాన్ని తెస్తాయని భావించారు. అందులో భాగంగానే టీఆర్‌ఎస్‌కు చెందిన ఆసిఫాబాద్‌ జెడ్‌పీటీసీ ఏమాజీ అధికార పార్టీని కాదని బీజేపీలో చేరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి పోటీ చేసే లక్ష్యంతో బీజేపీలోకి ఆయన రాగా, జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ సహా టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు కూడా బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ జిల్లా నాయకత్వం గానీ, జిల్లా ఇన్‌చార్జిలు గానీ తగిన విధంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో రమేష్‌ రాథోడ్‌ అధికార టీఆర్‌ఎస్‌లో చేరగా, మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావుతో పాటు సిర్పూర్‌కు చెందిన రావి శ్రీనివాస్‌ వంటి నాయకులు రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రత్యామ్నాయ శక్తి అనే భరోసా లేకనే...
కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తి తామేననే భరోసా ఇవ్వడంలో బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో విఫలం కావడం ఉమ్మడి ఆదిలాబాద్‌ను కూడా ప్రభావితం చేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల ముగిసిన సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ 24వేల ఓట్లకు పైగా సాధించగా, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీల ప్రత్యామ్నాయంగా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ కూటమి ఓడిపోయినా... 19 వేల ఓట్లు సాధించి సత్తా చాటాయి. అదే బీజేపీ అనుబంధ కార్మిక çసంఘం బీఎంఎస్‌ 250 ఓట్లు కూడా సాధించలేకపోయింది. ఈ విషయాన్ని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తావిస్తూ బీజేపీని ఎద్దేవా చేయడం వంటిæ పరిణామాలు ప్రజల్లో పార్టీ పట్ల ఆదరణ కోల్పోయే పరిస్థితిని కల్పిస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే మంచిర్యాల నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎన్‌.దివాకర్‌రావు తండ్రి లక్ష్మణ్‌రావు పేరిట ప్రభుత్వ భూమిలో 57.04 ఎకరాల భూమి ఆన్‌లైన్‌లోకి ఎక్కడం, ఆ అంశాన్ని కాంగ్రెస్, కమ్యూనిస్టులు తమకు అనుకూలంగా మలుచుకున్న తీరులో కూడా బీజేపీ నాయకులు స్పందించకపోవడం పార్టీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి కలిగించింది. ఉన్న అవకాశాలను వినియోగించుకోకుండా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కలేనని వారు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల కేంద్రంగా జరుగుతున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

మరిన్ని వార్తలు