బీజేపీని కలవరపెడుతున్న రాజస్తాన్‌ పరిణామాలు

26 Jun, 2018 11:26 IST|Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌లో జరుగుతన్న రాజకీయ పరిణామాలు బీజేపీని కలవరానికి గురిచేస్తున్నాయి. ఇటీవలే పార్టీకి రాజీనామ చేసిన సీనియర్‌ ఎమ్మెల్యే ఘన్‌శ్యామ్‌ తివారీ ప్రభత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం పార్టీని ఇబ్బందులోకి నెట్టింది. చాలా కాలంగా బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తు వస్తున్న ఘన్‌శ్యామ్‌ తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయల్లో మరింత వేడిని రగిలించాయి. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వసుంధర రాజే పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అగ్ర కులాలకు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రయత్నించడం లేదని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో అపక్రటిత ఎమర్జెన్సీ అమల్లో ఉందన్నారు. ఇంతకాలం బీజేపీలో కొనసాగిన ఘన్‌శ్యామ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

ఈ ఏడాది రాజస్తాన్‌లో రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప​ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో బీజేపీ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి.  బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలపై అధినాయకత్వం జోక్యం చేసుకోకపోవడం పార్టీ శ్రేణులను అభద్రత భావానికి గురిచేస్తోంది. దళిత, మైనార్టీ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు బీఎస్పీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. బీజేపీ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు కదుపుతుంది. మరోపక్క ఘన్‌శ్యామ్‌ కుమారుడు అఖిలేశ్‌ భారత్‌ వాహిని పార్టీ పేరుతో 200 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో బీజేపీ ఓటు బ్యాంక్‌ దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘన్‌శ్యామ్‌ గత ఎన్నికల్లో(2013) రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు.

మరిన్ని వార్తలు