శరణార్థినే శరణుజొచ్చి!

22 Nov, 2018 03:46 IST|Sakshi

బ్రూ గిరిజన తెగ ఓటర్లపై బీజేపీ వల

శిబిరాల్లో ప్రచారం.. భవిష్యత్తుపై భరోసా

మిజోరం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు అసెంబ్లీలో ఖాతా తెరవని బీజేపీ.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఏ అవకాశాన్నీ వదలకుండా తీవ్రంగా కృషిచేస్తోంది. మిజోరంలోని చక్మాలు, మారాలు, లాయిస్, బ్రూల ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతోంది. త్రిపురలో తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న బ్రూ గిరిజన తెగ శరణార్థుల ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ గిరిజనులకు చేసిందేమీ లేదంటూ.. బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 1997 సంవత్సరంలో మిజోలకు, బ్రూలకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. అవి హింసాత్మకంగా మారడంతో బ్రూలు పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లారు. ఉత్తర త్రిపురలో మొత్తం 6 తాత్కాలిక శిబిరాల్లో బ్రూ తెగవారు తలదాచుకుంటున్నారు. వీరిని వెనక్కి తీసుకురావడానికి మిజోరం, త్రిపురల్లో బ్రూ తెగ సంక్షేమం కోసం పోరాడుతున్న సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే.. కేవలం 31 కుటుంబాలే తిరిగి రాష్ట్రానికి వచ్చాయి. మరో 32 వేల మంది శరణార్థులు అక్కడే ఉన్నారు. వారిలో 11,232  మందికి ఓటు హక్కు ఉంది. అదే ఇప్పుడు బీజేపీ వీరిపై దృష్టిపెట్టేందుకు కారణమైంది. 

ఓటు హక్కుపై రగడ 
ఇంకా సొంత రాష్ట్రానికి తిరిగి రాని బ్రూ తెగ గిరిజనులు ఓటు హక్కు వినియోగంపై మిజోరంలో పెద్ద ఎత్తు ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. చివరికి రాష్ట్ర ఎన్నికల అధికారి ఎస్‌బీ శశాంక్‌ పదవికే ఎసరు వచ్చింది. త్రిపురలో శరణార్థి శిబిరాల్లో  బ్రూలు ఓటు హక్కు వినియోగానికి శశాంక్‌ అనుమతినిచ్చారు. శశాంక్‌ నిర్ణయాన్ని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి చువాంగ్‌ తప్పుపట్టారు. దీంతో ఎన్నికల విధుల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారంటూ శశాంక్‌ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ చువాంగ్‌పై వేటు వేసింది. ఈ పరిణామాలపై పౌర సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బ్రూలకు కొమ్ముకాస్తున్నారంటూ శశాంక్‌కు వ్యతిరేకంగా ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది. మిజోరం వచ్చి వాళ్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని డిమాండ్లు వినిపించాయి. ఈ ఆందోళనలకు తలొగ్గిన ఎన్నికల సంఘం.. శశాంక్‌ను తప్పించి ఆశిష్‌ కుంద్రాకు ఎన్నికల అధికారిగా బాధ్యతలు అప్పగించింది. మరోవైపు బ్రూలు స్థానికుల డిమాండ్‌ని వ్యతిరేకిస్తున్నారు. 2013 ఎన్నికల్లోనూ, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ తాము ఈ శిబిరాల నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ సున్నితమైన సమస్యను పరిష్కరించడానికి మధ్యేమార్గంగా మిజోరం, త్రిపుర సరిహద్దు గ్రామాల్లో పోలింగ్‌ బూతులు ఏర్పాటు చేసి బ్రూలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆశిష్‌ చర్యలు చేపట్టారు. అయితే బ్రూ గిరిజనులు ఓటు వేయడం పట్ల మెజారిటీ మిజోలకు కంటగింపుగా ఉంది. త్రిపురలో ఉన్న బ్రూలు ఓటేయడానికి ఎలాంటి ప్రత్యేక ఏర్పాటు చేయవద్దంటూ ఎన్నికల సంఘానికి మిజో విద్యార్థి సంఘం డిమాండ్‌ చేస్తోంది.  

స్పష్టమైన లక్ష్యాలతో.. 
ఈశాన్య ముక్త్‌ కాంగ్రెస్‌ కలను సాకారం చేసుకోవడానికి మిజోరం ఎన్నికలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. కాంగ్రెస్‌ను ఎలాగైనా ఓడించేందుకు పకడ్బందీ వ్యూహాలనే రచిస్తోంది. బ్రూ గిరిజన తెగ శరణార్థి ఓటర్ల సంఖ్య 11 వేలే అయినప్పటికీ జనాభా తక్కువగా ఉన్న మిజోలో స్వల్ప ఓట్లు కూడా అభ్యర్థి జయాపజయాల్ని నిర్ణయిస్తాయి. అందుకే ఆ ఓట్లను ఆకర్షించడానికి శరణార్థి శిబిరాలకు వెళ్లి మరీ ప్రచారం చేస్తోంది. బ్రూలను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వమే ప్రయత్నించిందని, రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెడితే వారి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తామంటూ ప్రచారం చేస్తోంది. 40 స్థానాలున్న మిజో అసెంబ్లీలో గత ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేసి 0.37శాతం మాత్రమే ఓటు షేర్‌ సాధించింది. ఇప్పుడు 39 స్థానాల్లో పోటీకి దిగుతోంది. క్రిస్టియన్ల జనాభా మెజారిటీగా ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీకి విజయావకాశాలు తక్కువే. అయితే వరసపెట్టి ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు బిగుస్తూ వస్తున్న కమలనాథులు మిజోరంలో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని నార్త్‌ ఈస్ట్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌ఈడీఏ)తో ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకోనప్పటికీ, హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే ఎన్నికల తర్వాత చేతులు కలిపే అవకాశాలున్నాయి.  

నామినేషన్లు కుప్పలుతెప్పలు.. 
ఎన్నికలు జరుగుతున్న 4 రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన ఛత్తీస్‌గఢ్‌లో ఒక సీటుకు సరాసరిగా 34 నామినేషన్లు దాఖలవగా.. మిజోరంలో కనిష్టంగా సగటున సీటుకు 5గురు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా నామినేషన్ల సంఖ్య వేలల్లో ఉంది. 

ప్రచార సామగ్రికి డిమాండ్‌! 
రాజస్తాన్‌లో ఎన్నికలు దగ్గరపడేకొద్దీ పార్టీల్లో, ప్రచారంలో వేడి పెరుగుతోంది. రోజురోజుకు  అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సామగ్రికి ఎక్కడలేని డిమాండ్‌ ఏర్పడింది. పార్టీలన్నీ ఒకదాన్ని మించి మరొకటి ప్రచారంలో పోటీపడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఎనలేని పాట్లు పడుతున్నాయి. ప్రమోషన్‌ కటౌట్లు, బ్యానర్లు, స్టికర్లు తదితర ప్రచార సామగ్రిని వినియోగిస్తున్నాయి. వీటి కోసం భారీగా ఆర్డర్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా బ్యానర్లు, పోస్టర్లకు బాగా గిరాకీ ఉందని వీటి ఉత్పత్తిదారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఎస్‌పీ, ఆప్‌ తదితర పార్టీలు పోటీలో ఉన్నాయి. అన్ని పార్టీల సామగ్రికీ గిరాకీ ఉందన్నారు.

మరిన్ని వార్తలు