నాలుగు చోట్ల బీజేపీ గట్టి పోటీ!

22 Mar, 2019 01:32 IST|Sakshi

సికింద్రాబాద్, పాలమూరు, కరీంనగర్, నిజామాబాద్‌ల్లో బలంగానే.. 

మల్కాజిగిరి, నాగర్‌ కర్నూలులోనూ దీటైన పోటీయే 

ఇవాళ రేపట్లో రెండో జాబితా.. 

టీఆర్‌ఎస్‌ అసంతృప్తులు, కాంగ్రెస్‌ సీనియర్లకు గాలం

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రమైన పోటీ కూడా లేకుండా చతికిలబడ్డ బీజేపీ.. లోక్‌సభ ఎన్నికలకు మాత్రం దీటుగానే సిద్ధమవుతోంది. గురువారం రాత్రి 10 స్థానాల కు ప్రకటించిన అభ్యర్థుల జాబితా బీజేపీ దూకు డును స్పష్టం చేస్తోంది. ఈ 10 స్థానాల్లో కనీసం నాలుగు స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. మహబూబ్‌నగర్‌ (అ రుణ), సికింద్రాబాద్‌ (కిషన్‌రెడ్డి), నిజామాబా ద్‌ (ధర్మపురి అరవింద్‌), కరీంగనర్‌ (బండి సం జయ్‌)లు పట్టున్న నేతలుగా బరిలో దిగుతుండడంతో ఈ స్థానాల్లో పోటీ బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గానే ఉండనుందని రాజకీయ పరిశీలకులు అంచనావేస్తున్నారు. మల్కాజిగిరి నుంచి బరి లో ఉన్న ఎమ్మెల్సీ రామచంద్రరావు, నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ) నుంచి పోటీచేస్తున్న బీజేపీ మా జీ జాతీయాధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ కుమార్తె బంగారు శ్రుతి కూడా.. అధికార, విపక్షాలకు దీటుగా సత్తాచాటే అవకాశాలు లేకపోలేదు. 

రెండో విడతలోనూ బలమైన అభ్యర్థులు 
ప్రస్తుతం 10మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదలవగా.. మిగిలిన ఏడుస్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు బీజేపీ జాతీయనాయకత్వం కసరత్తు చేస్తోంది. జహీరాబాద్‌ నుంచి లింగాయత్‌ల గురువు సోమాయప్ప స్వామిజీని పోటీకి ఒప్పించే ప్రయత్నాల్లో ఉంది. ఈ యత్నాలు ఫలిస్తే జహీరాబాద్‌ స్థానాన్ని గెలిచే అవకాశాలున్నాయని నాయకత్వం అంచనా వేస్తోంది. మెద క్‌ నుంచి పార్టీనేత రఘునందన్‌రావు, ఆదిలాబాద్‌ నుంచి తుడుందెబ్బ నేత సోయం బాపూ రావు, చేవెళ్ల నుంచి దత్తాత్రేయ వియ్యంకుడు జనార్దన్‌రెడ్డి/నందకుమార్‌ యాదవ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఖమ్మం నుంచి పోటీకి మొగ్గు చూపితే సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా ఆర్కే టీవీ చానల్‌ అధినేత రంగాకిరణ్, పెద్దపల్లి నుంచి మాజీ ఎంపీ జి.వివేక్‌ పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది. వివేక్‌ ఆసక్తి చూపకపోతే.. పార్టీ సీనియర్‌ నేత ఎస్‌.కుమార్‌ను బరిలోకి దింపొచ్చని సమాచారం. 

‘సికింద్రాబాద్‌ పార్లమెంటు సీటును నాకు కేటాయించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు. 15ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. నేనేంటో ప్రజలకు తెలుసు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు,యువత బీజేపీకి ఓటేస్తారని నమ్మకముంది. సిట్టింగ్‌ స్థానమైన సికింద్రాబాద్‌లో గెలుపే నాధ్యేయం. 25న నామినేషన్‌ వేస్తాను. హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాలను మినీ ఇండియాగా అభివృద్ధి చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను’    – కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్‌)

 ‘ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలపై ప్రధాని నరేంద్రమోదీ ప్రభావం స్పష్టంగా కనిపించబోతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఈసారి విజయం సాధిస్తాననే నమ్మకముంది. ఎమ్మెల్సీగా ఈ నియోజకవర్గంలోని ఓటర్లకు నేను సుపరిచితమే. విద్యావంతులు ఎక్కువగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గంగా.. నాకు కలిసొస్తుందని భావిస్తున్నాను. ఈసారి వీరు బీజేపీకి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. నిర్లక్ష్యానికి గురైన మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయడంతో పాటు మార్పు తీసుకొచ్చి చూపిస్తాను’    – ఎన్‌.రామచంద్రరావు (మల్కాజిగిరి)  


 

మరిన్ని వార్తలు