బీజేపీ కీలక ప్రకటన.. ప్రతిష్టంభన తొలగినట్లేనా?

5 Nov, 2019 20:37 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడిన ప్రతిష్టంభనకు త్వరలోనే ముగింపు పలికేలా మహారాష్ట్ర రాజకీయాలు కనిపిస్తున్నాయి. మంగళవారం బీజేపీ సీనియర్‌ నేతలు, మంత్రులు ముంబైలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ  భేటీలో ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సిన వ్యూహాలు, శివసేనతో చర్చలపై సుదీర్ఘంగా  చర్చించినట్లు సమాచారం. అయితే వీరి సమావేశం అనంతరం మంత్రి సుధీర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలోనే శుభవార్త వింటారని, అది ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉందని అన్నారు. తమ మిత్రపక్షం శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే వారి పిలుపు కోసం తాము ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. శివసేన ప్రచారం చేస్తున్నట్లు సీఎం పీఠంపై ప్రతిష్టంభన తొలగాలంటే తొలుత ఇద్దరి మధ్య చర్చలు జరగాలన్నారు. కానీ సీఎం మాత్రం బీజేపీ నుంచి ఉంటారని మరోసారి స్పష్టం చేశారు.

కాగా రాష్ట్ర శాసనసభ పదవీ కాలం ఈనెల 8తో ముగియనున్న నేపథ్యంలో.. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే శివసేనతో తొలుత చర్చలు జరిపేందుకు బీజేపీ నాయకత్వం  ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సేన నాయకత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే.. రెబల్స్‌ను తమవైపుకు తిప్పుకునేం‍దుకు గాలం వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు సీఎం పీఠంపై బీజేపీ వెనక్క తగక్కపోవడంతో వారికి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగానే  ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ను కలిశారు.

అయితే శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై సోనియాతో భేటీ అయిన పవార్‌ ఆ తరువాత ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోసారి చర్చించిన తరువాతనే తమ నిర్ణయం తెలుపుతామని పవార్‌ ప్రకటించారు. దీంతో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం భేటీ అయిన బీజేపీ నేతలు.. త్వరలోనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో రానున్న రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా