రాజ్యసభలో బీజేపీ హవా!

26 Feb, 2018 03:11 IST|Sakshi

మార్చి 23న ఎన్నికలతో కమలదళానికి మెజారిటీ

కీలకంగా మారనున్న యూపీ, రాజస్తాన్‌

న్యూఢిల్లీ: వచ్చే నెల 23న 16 రాష్ట్రాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుస్తామని కమలనాథులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా రాజ్యసభలో ప్రతిపక్షాలు కీలక బిల్లుల్ని అడ్డుకోవడాన్ని నిలువరించవచ్చన్నారు. ప్రస్తుతం 58 సీట్లతో రాజ్యసభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ను వెనక్కునెట్టింది. యూపీలో భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఖాళీ అయ్యే 10 సీట్లలో 8 చోట్ల బీజేపీ గెలవనుంది. ప్రస్తుతం యూపీలో బీజేపీకి ఓ రాజ్యసభ సభ్యుడు మాత్రమే ఉన్నారు.

అలాగే రాజస్తాన్‌లో ఖాళీకానున్న మూడు స్థానాలనూ కమలనాథులే దక్కించుకోనున్నారు. అయితే బిహార్‌లో ప్రస్తుతమున్న ఆరుస్థానాల్లో మూడు చోట్ల, గుజరాత్‌లోని నాలుగుస్థానాల్లో రెండుసీట్లను మాత్రమే బీజేపీ నిలుపుకునే అవకాశముంది. ఎన్డీఏ మిత్రపక్షాలతో పాటు కేంద్రానికి అనుకూలంగా ఉన్న అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్, బీజేడీ, వైఎస్సార్‌సీపీల మద్దతును కలుపుకుంటే 245 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ దక్కే అవకాశముందని ఓ బీజేపీ సీనియర్‌ నేత తెలిపారు.

ఈ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులు ఖరారు కానప్పటికీ పలువురు జాతీయ ఆఫీస్‌ బేర్లరను పార్టీ ఎంపికచేసే అవకాశముందన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులైన అనీల్‌ జైన్, అరుణ్‌ సింగ్, కైలాశ్‌ విజయవర్గియా, మురళీధర్‌రావు, రామ్‌మాధవ్, భూపేందర్‌ యాదవ్‌లు రాజ్యసభ అశావహుల జాబితాలో ఉన్నారన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రులు జైట్లీ,  జవదేకర్, రవిశంకర్‌ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డా, థావర్‌చంద్‌ గెహ్లాట్, రామ్‌దాస్‌ అథావలేల పదవీకాలం పూర్తికానుంది. వీరందరి పదవీకాలాన్ని కేంద్రం పొడిగించే అవకాశముందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు