‘వల్లభనేని వంశీకి బీజేపీ ఆహ్వానం’

29 Oct, 2019 17:41 IST|Sakshi

ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ భవిష్యత్‌లో ఏ పార్టీతోను కలవదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ బీజేపీతో కలవాలని ఉవ్విళ్లూరుతున్నారని ఎద్దేవా చేశారు. కానీ, టీడీపీకి బీజేపీలో గేట్లు మూసేశామని వెల్లడించారు. టీడీపీ, జనసేన లిమిటెడ్ పార్టీలని ఆయన ఎద్దేవా చేశారు. జనసేన పార్టీకి సంస్థాగత నిర్మాణమే లేదని చురకలంటించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతున్నామని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీని బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. ప్రజాక్షేత్రంలో బలం ఉన్న నాయకులు సగానికి సగం మంది బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకుందని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో బుధవారం జరగనున్న ముగింపు యాత్రలో జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పాల్గొంటారని వెల్లడించారు. సంకల్పయాత్రలో లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారని ఆయన వెల్లడించారు.
(చదవండి : టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా)

వర్మని బహిష్కరించాలి
‘రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ఏపీలో రిలీజ్‌ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి. సాంఘిక దూరాచారానికి రాంగోపాల్ వర్మ చేస్తున్న పనికీ తేడాలేదు. సంచలనం కోసం, చిల్లర ప్రచారం కోసం రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వర్మ వ్యవహరిస్తున్నాడు. వర్మని ఏపీలో బహిష్కరించాలి. రాయలసీమలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది’ అని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు