బిహార్‌లో 20–20 ఒప్పందం

31 Aug, 2018 03:34 IST|Sakshi

బీజేపీ, జేడీయూ మధ్య లోక్‌సభ సీట్ల పంపకం ఖరారు

పట్నా: బిహార్‌లో ఎన్డీఏ పక్షాల మధ్య 2019 లోక్‌సభ సీట్ల పంపిణీ ఖరారైంది. బీజేపీ, జేడీయూ మధ్య కుదిరిన 20–20 ఒప్పందం ప్రకారం బీజేపీ 20 స్థానాల్లోనే పోటీ చేస్తుంది. జేడీయూకు 12, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) 7 చోట్ల, ఉపేంద్ర కుష్వాహ సారధ్యంలోని రాష్ట్రీయ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ)కి రెండు చోట్ల బరిలోకి దిగేందుకు ఒప్పందం కుదిరింది. కుష్వాహతో విభేదిస్తున్న ఎంపీ అరుణ్‌ కుమార్‌కు ఒక స్థానాన్ని ఇవ్వనున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ 30 చోట్ల పోటీకి దిగి 22 స్థానాలను గెలుచుకుంది. తాజా ఒప్పందం ప్రకారం గెలిచే అవకాశం ఉన్న 2 స్థానాలను మిత్ర పక్షాలకు వదిలేసింది.

ఈ స్థానాలు దర్భంగా, బక్సార్‌ కావచ్చు. దర్భంగా ఎంపీ కీర్తి ఆజాద్‌పై సస్పెన్షన్‌ వేటు పడగా, బక్సార్‌ ఎంపీ అశ్వినీ చౌబే మరో చోట నుంచి పోటీకి దిగొచ్చు. పట్నా సాహిబ్‌ ఎంపీ శతృఘ్నసిన్హాతోపాటు బెగూసరాయ్‌ ఎంపీ భోలాసింగ్‌పైనా వేటుపడనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పాట్నా సాహిబ్‌ ఎంపీ శతృఘ్న సిన్హా ప్రధాని విధానాలను విమర్శించడంతోపాటు ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను పొడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించే అవకాశాలున్నాయి.  అయితే, సీట్ల పంపకం అంశం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదని బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ గురువారం వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు