ఉచిత వైఫై, పింక్‌ టాయిలెట్లు!

13 Nov, 2017 03:50 IST|Sakshi

లక్నో: ప్రముఖ ప్రదేశాల్లో ఉచిత వైఫై, మహిళల కోసం ప్రత్యేకంగా ‘పింక్‌ టాయిలెట్లు’, ఉచిత మంచినీటి కనెక్షన్లు.. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇస్తున్న హామీలివి. ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో ఆదివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ శర్మ తదితరులతో కలసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం యోగి మాట్లాడుతూ, ఎలాంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా ప్రజలకు సేవలందిస్తామని చెప్పారు.

నవంబర్‌–డిసెంబర్‌లో 16 మున్సిపల్‌ కార్పొరే షన్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 652 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉచిత కమ్యూనిటీ టాయిలెట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లకు రూ.20 వేల గ్రాంటు, జంతువులకు షెల్టర్లు, ఈ–టెండరింగ్‌.. తదితర 28 హామీలను మేనిఫెస్టోలో బీజేపీ ఇచ్చింది. మరోవైపు బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ విడుదల చేసినది సంకల్ప్‌ పత్ర కాదని, ఛల్‌ పత్ర (ప్రజలను మోసగించే పత్రం) అని సమాజ్‌వాదీ పార్టీ విమర్శించింది. గతంలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరగనున్న తొలి ముఖ్య ఎన్నికలు కావడంతో.. ఆయనకు పాలనకు ఇవి పరీక్షగా మారనున్నాయి.

మరిన్ని వార్తలు