సీపీఎం మహాసభల్లో మోదీ జపం 

24 Apr, 2018 01:16 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఎద్దేవా

సాక్షి, న్యూఢిల్లీ : సీపీఎం మహాసభల్లో పాల్గొన్న నేతలంతా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా ప్రధాని నరేంద్ర మోదీ జపం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుతో కలసి సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడు తూ దేశవ్యాప్తంగా రోజురోజుకూ తుడిచిపెట్టుకుపోతున్న సీపీ ఎం తన మూలాలను బలోపేతం చేసుకోవడంపై మహాసభల్లో దృష్టిసారించి ఉంటే బాగుండేదన్నారు. మోదీకి పెరుగుతున్న ఆదరణ, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ దూసుకుపోతుండడం చూసి ఓర్వలేకనే ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాల్లో సీపీఎంకు బాధ్యత ఉందని, దీనిపై ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో ఓటమి పాలైన సీపీఎంను త్వరలో కేరళ ప్రజలు కూడా తిరస్కరిస్తారన్నారు.

కాంగ్రెస్‌ది ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌...: జీవీఎల్‌ 
కాంగ్రెస్‌ది ఎమర్జెన్సీ మైండ్‌ సెట్‌ అని, ప్రజాస్వామ్య విలువలపై ఆ పార్టీకి గౌరవం లేదని జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా భారత దేశ ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, పార్లమెంటరీ విధానాలు, సైన్యం, ఎన్నికల కమిషన్‌కు మంచి గుర్తింపు ఉందని, కాంగ్రెస్‌  ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడుతోందన్నారు.

మరిన్ని వార్తలు