కేసీఆర్‌ చెప్తే నా పదవికి రాజీనామా చేస్తా: లక్ష్మణ్‌

3 Jan, 2020 16:57 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ముస్లిం పదం లేదని పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తున్నారంటే పాకిస్తాన్‌కు వత్తాసు పలుకుతున్నట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రానంతరం ముస్లింలకు ప్రత్యేక దేశాలిచ్చినా.. హిందువుల మీద దాడి మాత్రం ఆపలేదని మండిపడ్డారు. నిజామాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి లక్ష్మణ్‌, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ హాజరయ్యారు.  లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. భారత్‌ నుంచి విడిపోయిన ప్రాంతాలు ఇస్లాం దేశాలుగా ఏర్పడితే మనది మాత్రం సెక్యులర్‌ దేశంగా మిగిలిందన్నారు. తెలంగాణ పేరుతో ఆనాడు ఆంధ్ర ఉద్యోగులు, ప్రజలపై దాడి చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు దేశంలోని హిందువులపై దాడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆరా లేక ఓవైసీనా అని ప్రశ్నించారు.

సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. సరైన సమాధానం చెబితే బీజేపీ రాష్ట్ర పదవికి రాజీనామ చేస్తానని ప్రకటించారు. హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే కేసీఆర్‌కు పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. భద్రాచలంలో రామునికి తలంబ్రాలు ఇ‍వ్వలేని నువ్వు హిందువు ఎలా అవుతావని కేసీఆర్‌ను నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షాలు కృష్ణార్జుల్లా దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం బీజేపీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వేతో అరాచకం సృష్టించిన కేసీఆర్‌.. ఇప్పుడు ఎన్‌పీఆర్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని లక్ష్మణ్‌  ప్రశ్నించారు.

అమెరికాలో చదివి రాజ్యాంగం మరిచిపోయారు
నిజామాబాద్‌లో సభ పెడితే హైదరాబాద్‌లో కేసీఆర్‌ వణుకుతున్నారని బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్‌ దుయ్యబట్టారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌ ముస్లింలకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దిన్‌ ఒవైసీ గడ్డం పీకీ కేసీఆర్‌కు పెడతా. ఏం పీకుదామని నిజామాబాద్‌కు వచ్చారో ఓవైసీ చెప్పాలి. కూతురు ఓడిపోయిందన్న బాధలో అసద్‌ను కేసీఆర్‌ మాటిమాటికీ నిజామాబాద్‌ పంపుతున్నారు. కేటీఆర్ అమెరికాలో చదివి రాజ్యాంగం మరిచిపోయారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ బలోపేతం అవుతోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ 95 శాతం ఓట్లు వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. 

జిన్నా కాలం పోయింది గుర్తుంచుకో
బీజేపీతో పెట్టుకుంటే ఎంఐఎం చనిపోతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవ్‌ధర్‌ అన్నారు. పాకిస్తాన్‌ భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుందని, ఒవైసీ దేశాన్ని ముక్కలు చేయాలని మతం పేరుతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. జిన్నా కాలం పోయిందని గుర్తుంచుకో ఒవైసీ అంటూ ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. గతంలో ఈ బిల్లును తేవాలని చెప్పిన పార్టీలన్నీ ఇప్పుడు వ్యతిరేకించడం అన్యాయమన్నారు. దేశంలో ఉన్న పాకిస్తానీ, బంగ్లాదేశ్‌ ముస్లింలను కచ్చితంగా పంపిస్తామని తెలిపారు. బీజేపీ ఉన్నంత వరకు దేశ రక్షణ కోసం పనిచేస్తామని, తెలంగాణలో బీజేపీని గెలిపించాలని సునీల్‌ కోరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు